నర్సింగ్ హోమ్‌కి అతిథిగా మహేశ్

18 Sep, 2016 02:28 IST|Sakshi
నర్సింగ్ హోమ్‌కి అతిథిగా మహేశ్

 ‘‘మా కుటుంబం నుంచి హీరోగా పరిచయమవుతున్న మూడో తరం కుర్రాడు నవీన్. నాలుగేళ్లుగా యాక్టింగ్, డ్యాన్స్, డైలాగ్ డెలివరీ.. హీరోకి ఎన్ని లక్షణాలు అవసరమో  అన్నింటిలోనూ శిక్షణ తీసుకున్నాడు. ఈ సినిమాతో నవీన్‌కి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. ఈ నెల 27న జరగబోయే ఆడియో వేడుకకి మహేశ్‌బాబు ముఖ్య అతిథిగా హాజరవుతున్నాడు’’ అని సూపర్‌స్టార్ కృష్ణ అన్నారు. సీనియర్ నటుడు నరేశ్ తనయుడు నవీన్ విజయకృష్ణ హీరోగా నటించిన సినిమా ‘నందిని నర్సింగ్ హోమ్’.
 
  ఇక్కడ అంతా క్షేమం.. అనేది ఉప శీర్షిక. పీవీ గిరి దర్శకత్వంలో జి.రాధాకిశోర్, సంగం భిక్షమయ్య నిర్మించిన ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను శనివారం కృష్ణ, విజయనిర్మల ఆవిష్కరించారు. ‘‘వంద శాతం వినోదాత్మక చిత్రమిది. ఈ ఏడాది హిట్ సినిమాల్లో ఒకటిగా నిలుస్తుంది’’ అన్నారు నరేశ్. ‘‘షూటింగ్ పూర్తయింది. డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. నాకు మంచి పేరు తీసుకొచ్చే సినిమా అవుతుంది’’ అన్నారు హీరో నవీన్ విజయకృష్ణ. చిత్ర దర్శకుడు పీవీ గిరి, హీరోయిన్ నిత్య, నిర్మాతలు జి.రాధాకిశోర్, సంగం భిక్షమయ్య పాల్గొన్నారు.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
సినిమా