అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లా ‘నంది’ గోల్డెన్‌ జూబ్లీ వేడుకలు

5 Apr, 2017 00:13 IST|Sakshi
అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లా ‘నంది’ గోల్డెన్‌ జూబ్లీ వేడుకలు

‘‘చలనచిత్ర రంగంలో విశిష్ట సేవలందించిన వారికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 1964 నుంచి ‘నంది’ అవార్డులు అందిస్తోంది. ఈ అవార్డుల ప్రదానం ప్రారంభించి యాభై ఏళ్లు పూర్తయిన సందర్భంగా అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల స్థాయిలో ‘నంది’గోల్డెన్‌ జూబ్లీ   వేడుకలు నిర్వహించాలని సీఎం చంద్రబాబు నాయుడుగారు చెప్పారు’’ అని సినీ నటుడు మురళీమోహన్‌ అన్నారు.

 ఏపీ ప్రభుత్వం 2012, 2013 సంవత్సరాలకు జాతీయ చలనచిత్ర, రాష్ట్రీయ చలనచిత్ర అవార్డులను ఎంపిక చేసింది. హీరో బాలకృష్ణ,  మురళీ మోహన్, నిర్మాత రమేశ్‌ ప్రసాద్, శాంతా బయోటెక్‌ వరప్రసాద్‌ రెడ్డి అవార్డు ఎంపిక కమిటీ సభ్యులుగా, ఏపీ చలన చిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వెంకటేశ్వర్‌ సమన్వయకర్తగా వ్యవహ రించారు.

విజేతల వివరాలను మంగళవారం ప్రకటించారు. 2012, 2013 ఎన్‌.టి.ఆర్‌. జాతీయ చలనచిత్ర అవార్డులకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (గాయకుడు), హేమమాలిని(నటి), 2012, 13 బీఎన్‌ రెడ్డి జాతీయ చలనచిత్ర అవార్డులకు సింగీతం శ్రీనివాసరావు (దర్శకులు), కోదండరామిరెడ్డి (దర్శకులు), 2012, 13 నాగిరెడ్డి, చక్రపాణి జాతీయ చలనచిత్ర అవార్డులకు డి. సురేశ్‌ (నిర్మాత), ‘దిల్‌’ రాజు (నిర్మాత) ఎంపికయ్యారు.

 2012, 13 రఘుపతి వెంకయ్య చలనచిత్ర అవార్డులకు కోడి రామకృష్ణ (డైరెక్టర్‌), వాణిశ్రీ(నటి) ఎంపికయ్యారు.  ‘‘చలనచిత్ర రంగంలో విశిష్ట సేవలందించిన వారికి ఈ అవార్డులివ్వడం హ్యాపీ. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం విడిపోయిందని ఒక్క రాష్ట్రానికే ఈ అవార్డులు పరిమితం చేయలేదు’’అన్నారు బాలకృష్ణ. మురళీ మోహన్‌ మాట్లాడుతూ– ‘‘2014,15, 16 సంవత్సరాల ‘నంది’ అవార్డుల ఎంపికకు ప్రభుత్వం ఓ కమిటీ వేసింది. రెండు మూడు నెలల్లో ఆ ప్రక్రియ పూర్తవుతుంది.

ఆ తర్వాత ఒకే వేదికపై ఐదేళ్ల ‘నంది’ అవార్డులు ప్రదానం చేస్తాం. అదే వేదికపై జాతీయ చలనచిత్ర, రాష్ట్రీయ చలనచిత్ర అవార్డులనూ అందించనున్నాం. ఈ వేడుకలో ప్రతి జిల్లా నుంచి ఐదుగురు కళాకారులను ఎంపిక చేసి సత్కరించనున్నాం. ఈనెల 30న రాజమహేంద్రవరంలో టీ.వీ. నంది నాటకోత్సవం అవార్డులు అందించబోతున్నాం’’ అని చెప్పారు. రమేశ్‌ ప్రసాద్, వెంకటేశ్వర్‌ పాల్గొన్నారు.