ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ మెగాఫోన్!

1 Jun, 2016 01:22 IST|Sakshi
ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ మెగాఫోన్!

చెట్టు పొదల చుట్టూ తిరుగుతూ పాటలు పాడుకునే పాత్రలు కాకుండా వాటికి పూర్తి భిన్నంగా ఉండే పాత్రలు చేసే కథానాయికలు అరుదుగా ఉంటారు. చెప్పాలంటే... ఈ తరహా నాయికలు వేళ్ల మీద లెక్కపెట్టేంత మంది కూడా ఉండరు. అందుకే అలాంటి పాత్రలు చేసే తారలు ఎప్పటికీ గుర్తుండిపోతారు. నందితా దాస్ అలాంటి నాయికే. ‘ఫైర్’ వంటి సంచలన చిత్రం ద్వారా నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నందిత. ‘అమృత’, ‘కమ్లి’ వంటి చిత్రాలతో దక్షిణాదిన కూడా భేష్ అనిపించుకున్నారామె. ఆర్ట్ తరహా చిత్రాల పైనే నందిత ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు.

చివరికి తాను దర్శకురాలిగా మారి, తీసిన తొలి చిత్రం ‘ఫిరాక్’ కూడా ఆ కోవలోనే ఉంటుంది. 2002లో గుజరాత్‌లో జరిగిన మారణకాండ ఆధారంగా నందిత తీసిన ఈ చిత్రం దర్శకురాలిగా ఆమెకు మంచి పేరు తెచ్చింది. 2008లో ఆమె ఈ చిత్రం తీశారు. ఆ తర్వాత మళ్లీ డెరైక్షన్ జోలికి వెళ్ల లేదు. ఈ ఏడాది మెగాఫోన్ పట్టుకోవడానికి రెడీ అయ్యారు. ప్రముఖ ఉర్దూ రచయిత సాదత్ హసన్ మంటో జీవితం ఆధారంగా ఓ సినిమా రూపొందించ నున్నారు.  1912లో జన్మించిన మంటో 1955లో చనిపోయారు.

నందిత దర్శకత్వం వహించిన ‘ఫిరాక్’ ద్వారా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చు కున్న నవాజుద్దీన్ సిద్ధిఖి టైటిల్ రోల్ చేయనున్నారు. ‘‘మంటోలాంటి చాలెంజింగ్ రోల్ నవాజుద్దీనే చేయగలుగుతారు’’ అని నందిత పేర్కొ న్నారు. గత మూడేళ్లుగా ఆమె కథను వర్కవుట్ చేస్తున్నారు. మంటో కుటుంబ సభ్యులను కలిసి, ఆమె కొంత సమాచారం సేకరించారు.