ఈ ఇద్దరిలో నానీకి గెస్ట్‌ ఎవరు?

31 Aug, 2017 23:32 IST|Sakshi
ఈ ఇద్దరిలో నానీకి గెస్ట్‌ ఎవరు?

కంటిన్యూస్‌గా ఏడు హిట్స్‌తో నాని ఫుల్‌ జోరుగా ఉన్నారు. ఈ సక్సెస్‌ఫుల్‌ హీరో డేట్స్‌ కోసం నిర్మాతలు వెయిట్‌ చేస్తుంటే, నాని మాత్రం తనకు తానే డేట్స్‌ ఇచ్చుకున్నారట. అదేంటీ అనుకుంటున్నారా? మరేం లేదు. నాని నిర్మాతగా మారుతున్నారని సమాచారం. నాలుగేళ్ల క్రితం ‘డి ఫర్‌ దోపిడి’ సినిమాకి నాని జస్ట్‌ భాగస్వామిగా వ్యవహరించిన విషయం చాలామందికి తెలిసే ఉంటుంది. ఇప్పుడు మాత్రం పూర్తి స్థాయి నిర్మాతగా మారనున్నారని టాక్‌.

 నూతన దర్శకుడు ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారట. మరో విషయం ఏంటంటే.. ఈ చిత్రంలో హీరోయిన్‌ పాత్రకు, ఓ గెస్ట్‌ రోల్‌కు కాజల్‌ అగర్వాల్, నిత్యామీనన్‌ల పేర్లను పరిశీలిస్తున్నారని భోగట్టా. ఆల్రెడీ నాని సరసన ‘అలా మొదలైంది’, ‘సెగ’ చిత్రాల్లో నిత్య నటించారు. కాజల్‌ అగర్వాల్‌ మాత్రం నటించలేదు. మరి.. నాని హీరోగా నటించి, నిర్మించనున్న చిత్రంలో ఈ ఇద్దరిలో ఎవరు గెస్ట్‌ రోల్‌ చేస్తారు? ఎవరు నాయికగా నటిస్తారు? అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ వీళ్ల ప్లేస్‌లో వేరే తారలు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.