తెలుగు సినిమా నెక్ట్స్‌ లెవెల్‌కు వెళ్లబోతోంది

29 May, 2019 02:41 IST|Sakshi

‘‘ఫలక్‌నుమా దాస్‌’ సినిమా మొదలైన పది నిమిషాల వరకు ఇదేం సినిమా? అనే చిన్న కన్ఫ్యూజన్‌ ఉంటుంది. ఆ తర్వాత ప్రేక్షకులు సినిమా మూడ్‌ లోకి వెళ్తారు. అంతగా కనెక్ట్‌ చేసేస్తుంది’’ అని హీరో నాని అన్నారు. విశ్వక్‌ సేన్‌ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘ఫలక్‌నుమా దాస్‌’. కరాటే రాజు సమర్పణలో విశ్వక్‌ సేన్‌ సినిమాస్, టెర్రనోవా పిక్చర్స్‌ బ్యానర్స్‌పై రూపొందిన ఈ సినిమా ఈ నెల 31న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో నాని మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా ట్రైలర్‌ ఆసక్తికరంగా ఉండడం, నా ‘వాల్‌పోస్టర్‌’ ప్రొడక్షన్‌ బేనర్‌లో నెక్ట్స్‌ విశ్వక్‌ సేన్‌ చేయబోతుండటం, ‘ఫలక్‌నుమాదాస్‌’ సినిమా నాకు చూపించడం వల్లే ఈ ఫంక్షన్‌కి వచ్చాను. ప్రివ్యూ థియేటర్‌లోనే ఎంజాయ్‌ చేశామంటే, ప్రేక్షకులు ఎంత ఎంజాయ్‌ చేస్తారు? ఈ చిత్రంలో అందరూ బాగా నటించారు. అన్నింటినీ మించిన పెర్ఫార్మెన్స్‌ తరుణ్‌ భాస్కర్‌ది.

తరుణ్‌ ఇక డైరెక్షన్‌ మానేయొచ్చు. యాక్టర్‌గా కంటిన్యూ చేస్తే డైరెక్టర్‌ కంటే 3 రెట్లు ఎక్కువ సంపాదించొచ్చు. ఏడాదిలో ఒక్కరోజు కూడా ఖాళీగా ఉండవు. అందుకు నాదీ గ్యారెంటీ. ఇండస్ట్రీకి కొత్తగా వస్తున్నవారిని చూస్తుంటే మన తెలుగు సినిమా నెక్ట్స్‌ లెవెల్‌కు వెళ్లబోతోందనిపిస్తోంది’’ అన్నారు. హీరో, డైరెక్టర్‌ విశ్వక్‌ సేన్‌ మాట్లాడుతూ– ‘‘సినిమా నేపథ్యం లేకున్నా సినిమాల్లోకి రావచ్చనే ధైర్యం నానీ అన్న వల్లే వచ్చింది. నేను డైరెక్షన్‌ చేస్తున్నప్పుడు అందరూ భయపెట్టారు. నాకు ఎలానూ బ్యాక్‌గ్రౌండ్‌ లేదు.. ఏదైనా జరిగితే బ్యాగ్‌ సర్దుకుని వెళ్లిపోవాలనుకున్నా. కానీ, అలా జరగదనే ఈ సినిమా తీశా. టీజర్‌కే బ్యాగ్‌ ప్యాక్‌ చేసుకునే చాన్స్‌  లేకుండా చేశారు’’ అన్నారు. ‘‘నన్ను యాక్టర్‌ను చేసినందుకు విశ్వక్‌కి థ్యాంక్స్‌. విజయ్‌ దేవరకొండ, విశ్వక్‌కు మధ్య వ్యక్తిత్వంలో పోలికలు ఉన్నాయి. సెట్‌లో అందరినీ ప్రేమగా చూసుకుంటారు’’ అన్నారు తరుణ్‌ భాస్కర్‌. కరాటే రాజు, సంగీత దర్శకుడు వివేక్‌ సాగర్, సహ నిర్మాత మీడియా 9 మనోజ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా