ఆ భయం లేదు!

23 Sep, 2016 00:28 IST|Sakshi
ఆ భయం లేదు!

‘‘ ‘మజ్ను’ అనగానే విషాద ప్రేమకథా చిత్రం అనుకుంటారందరూ. కానీ, మా ‘మజ్ను’ మాత్రం సిన్సియర్ ప్రేమకథా చిత్రం. ప్రేమ విఫలమైందని మందు తాగితే జీవితం కూడా నాశనం అవుతుంది. ఫెయిలైన ప్రేమను మళ్లీ ఎలా సక్సెస్ చేసుకోవాలన్నది ఆసక్తికరంగా, వినోదాత్మకంగా చూపించాం’’ అని దర్శకుడు విరించి వర్మ అన్నారు. నాని, అనూ ఇమ్మాన్యుయెల్, ప్రియాశ్రీ ప్రధాన పాత్రల్లో ఆయన దర్శకత్వంలో  పి.కిరణ్, గోళ్ల గీత నిర్మించిన ‘మజ్ను’ నేడు విడుదలవుతోంది.
 
 దర్శకుడు మాట్లాడుతూ- ‘‘దర్శకుడు మదన్‌గారి దగ్గర అసిస్టెంట్‌గా పనిచేశా. కె.విశ్వనాథ్, బాలచందర్, బాపు, వంశీ, భారతీరాజాగార్ల ఇన్‌స్పిరేషన్‌తో దర్శకుడినయ్యా. ఈ తరం దర్శకుల్లో రాజమౌళి, త్రివిక్రమ్, పూరీ జగన్నాథ్ సినిమాలంటే ఇష్టం. లవ్ ఫెయిల్యూర్స్ చాలామందికి ఉంటాయి. కానీ, సిన్సియర్ ప్రేమ ఫెయిల్యూర్ అయినా మళ్లీ సక్సెస్ చేసుకోవచ్చు. ఇద్దరు హీరోయిన్లు ఉన్నా, ఇది ట్రయాంగిల్ లవ్‌స్టోరీ కాదు.
 
 నా తొలి చిత్రం  ‘ఉయ్యాలా జంపాలా’  హిట్ అయింది. అందరూ ద్వితీయ విఘ్నం అంటారు. కానీ, కథపై నాకు చాలా నమ్మకం. అందుకే ఆ  భయం లేదు. ఈ చిత్రంలో రాజమౌళిగారు, హీరో రాజ్‌తరుణ్ అతిథి పాత్రల్లో కనిపిస్తారు. ప్రస్తుతం మరో కథ సిద్ధం చేస్తున్నాను. ఆ కథలో రాజ్‌తరుణ్, నాని కాకుండా వేరే హీరో నటిస్తారు’’ అన్నారు.