ఈ వారం తర్వాత ఏ కాశీకో వెళ్లిపోతా: నాని

25 Sep, 2018 16:03 IST|Sakshi

నాగార్జున‌, నాని హీరోలుగా శ్రీ‌రామ్ ఆదిత్య తెర‌కెక్కించిన సినిమా దేవ‌దాస్. ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 27న విడుద‌ల కానుంది. ఆకాంక్ష సింగ్‌, రష్మిక మందన్నలు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను వైజయంతి మూవీస్‌ బ్యానర్‌పై అశ్వనిదత్‌ నిర్మించారు. మణిశర్మ సంగీతమందించారు. రిలీజ్ డేట్‌ దగ్గర పడుతుండటంతో చిత్రయూనిట్ మీడియా స‌మావేశం ఏర్పాటు చేసారు. 

ఈ సందర్భంగా నిర్మాత అశ్వినీద‌త్ మాట్లాడుతూ.. ‘మ‌హాన‌టి అప్పుడు నేను ఎప్పుడు మిమ్మల్ని క‌ల‌వ‌లేదు. ఈ సినిమాకు మాత్రం పెద్ద హీరోలు నాకు తోడుగా, అండ‌గా.. వాళ్ల భుజాల‌పై వేసుకుని న‌డిపించిన సినిమా కాబ‌ట్టి మీ ముందుకు వ‌చ్చాను. చాలా ఏళ్ల త‌ర్వాత వైజ‌యంతి మూవీస్ బ్యాన‌ర్ నుంచి ప్రతిష్మాత్మకంగా నిర్మించిన చిత్రం ఇది. రెండున్నర గంట‌ల పాటు ప్రేక్షకుల‌ను న‌వ్వించే సినిమా ఇది అవుతుంది’ అన్నారు.

హీరో నాగార్జున మాట్లాడుతూ.. ‘అశ్వినీదత్ గారు ఆఖ‌రి పోరాటం అప్పుడు ఎలా ఉన్నారో.. ఇప్పుడు అలాగే ఉన్నారు. ఆయ‌నకు సినిమాపై ఉన్న ప్యాష‌న్ ఇంకా అలాగే ఉంది. దేవ క్యారెక్టర్ ఇంట‌ర్నేష‌న‌ల్ డాన్ క్యారెక్టర్‌గా తీసుకున్నాం. దాంట్లో వ‌యోలెన్స్ కానీ.. మాఫియా యాక్టివిటీస్ కానీ పెద్దగా చూపించ‌లేదు. దాస్ తో దేవ స్నేహ‌మే దేవ‌దాస్ సినిమా. ఒక‌రిని ఇంకొక‌రు ఎలా ఇన్ఫ్లూయెన్స్ చేస్తార‌నేది సినిమాలో మెయిన్ పాయింట్. సినిమాలో సినిమాటోగ్రఫి చాలా బాగుంది. కెమెరామెన్‌ శ్యామ్ తో మ‌రోసారి వ‌ర్క్ చేయాల‌ని ఉంది’ అని అన్నారు.

హీరో నాని మాట్లాడుతూ.. దాస్ చాలా ఇన్నోసెంట్. సాఫీగా సాగుతున్న లైఫ్ లోకి ఊహించ‌కుండా ఎవ‌రూ లైఫ్ లో చూడ‌ని ఓ వ్యక్తి ఫ్రెండ్ గా వ‌స్తే వాడి లైఫ్ ఎలా మారిపోతుంది అనేది కారెక్టర్. ఫోన్ విష‌యంలో కూడా ఎప్పుడూ తాను చేతిలో ప‌ట్టుకునే ఉంటాన‌ని నాగ్ స‌ర్ వీడియో చేసారు. అయితే నాగార్జున గారు ప‌క్కనే ఉన్నపుడు అలాంటి ధైర్యం చేయ‌లేదు కానీ వీడియో చేసే స‌రికి అది వైర‌ల్ అయిపోయింది. నాగార్జున గారితో స్క్రీన్ షేర్‌ చేసుకోవ‌డ‌మే అదృష్టం. నా లైఫ్ లో మోస్ట్ హెట్టిక్ వీకెండ్ ఇది. మోస్ట్ స్ట్రెస్ ఫుల్  వీక్.. ఎక్సైటింగ్ వీక్ కూడా ఇదే. బిగ్‌బాస్ ఫైన‌ల్ కూడా ఇదే వారం ఉండ‌టంతో  ఒత్తిడి ఉంది. ప్లస్ మైన‌స్ రెండూ ఉన్నాయి. ఈ వారం అయిపోతే కొన్ని రోజులు ఏ కాశీకో వెళ్లిపోతాను’ అన్నారు. 

హీరోయిన్ ర‌ష్మిక మాట్లాడుతూ.. ‘నా కారెక్టర్ ఇందులో గాల్ నెక్ట్స్ డోర్ లా ఉంటుంది. సినిమా చూసిన త‌ర్వాత మీకే అర్థం అవుతుంది. రేపు సినిమా చూసిన త‌ర్వాత ప్రేక్షకుల‌కు కూడా న‌చ్చుతుంద‌ని భావిస్తున్నాను’ అని చెప్పారు. మరో హీరోయిన్ ఆకాంక్ష సింగ్ మాట్లాడుతూ.. ‘నాగార్జున గారు సీన్ విష‌యాల్లో చాలా హెల్ప్ చేసారు. ఆయ‌న చెప్పిన టిప్స్ అద్భుతంగా ప‌నిచేసాయి. ఆయ‌న‌తో ప‌నిచేయ‌డం.. స్క్రీన్ షేర్ చేసుకోవ‌డం అదృష్టంగా భావిస్తున్నాను’ అని చెప్పారు. 

దర్శకుడు శ్రీ‌రామ్ ఆదిత్య మాట్లాడుతూ.. ‘సెట్ లో మోస్ట్ కంఫ‌ర్ట‌బుల్ యాక్టర్స్ నాగార్జున గారు. మామూలు సినిమా, మ‌ల్టీస్టార‌ర్స్ అని తేడా నాకు ఉండ‌దు. మ‌ల్టీస్టార‌ర్ అంటే ఎగ్జైట్ మెంట్ ఉంటుంది. ఒకేసారి ఇద్దరు హీరోల బెట‌ర్ ప‌ర్ఫార్మెన్స్ చూడొచ్చు. ఇది ఏ సినిమా రీమేక్ కాదు. సొంత క‌థ‌తోనే దేవ‌దాస్ తెర‌కెక్కించాను. ఫ్రెండ్ షిప్ నేపథ్యంలోనే ఈ సినిమా తెర‌కెక్కింది. చిన్న స‌ర్‌ప్రైజ్ కూడా ఉంటుంది సినిమా చూస్తే అర్థమైపోతుంది. ఫ్లాష్‌బ్యాక్‌లు ఎన్ని ఉంటాయ‌నేది సినిమా చూసి తెలుసుకోండి’ అని చెప్పారు. 
 

మరిన్ని వార్తలు