నాని ఫాంలోకి వచ్చాడు

4 Jun, 2016 14:27 IST|Sakshi
నాని ఫాంలోకి వచ్చాడు

యంగ్ హీరో నాని ఫాంలోకి వచ్చాడు. కొద్ది రోజులుగా ఆచితూచి సినిమాలు చేస్తున్న ఈ సహజ నటుడు, ఇప్పుడు వరుస సినిమాలకు రెడీ అవుతున్నాడు. వరుస విజయాలతో మంచి ఊపుమీదున్న ఈ యంగ్ హీరో ఈ ఏడాది మూడు సినిమాలను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నాడు. ఈ ఏడాది మొదట్లోనే కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో డీసెంట్ సక్సెస్ సాధించిన నాని, మరో రెండు సినిమాలను ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు.

ప్రస్తుతం తనను హీరోగా పరిచయం చేసిన ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో జెంటిల్మేన్ సినిమాను రిలీజ్కు రెడీ చేశాడు నాని. ఈ సినిమాను జూన్ 17న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసుకున్న నాని, వెంటనే తన నెక్ట్స్ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళుతున్నాడు. జెంటిల్మేన్ ప్రమోషన్ కోసం చిన్న గ్యాప్ తీసుకొని వెంటనే సినిమా చూపిస్తా మామ ఫేం నక్కిన త్రినాథ్ రావు దర్శకత్వంలో కామెడీ ఎంటర్టైనర్లో నటించడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను కూడా 2016లోనే రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నాడు నాని.