హిట్‌ అందరికీ నచ్చుతుంది

28 Feb, 2020 00:13 IST|Sakshi
విశ్వక్‌సేన్, రుహానీ శర్మ, నాని, శైలేష్‌ కొలను, ప్రశాంతి త్రిపిర్‌నేని

‘‘కొత్త కాన్సెప్ట్, ప్రతిభని ప్రోత్సహించడానికే వాల్‌ పోస్టర్‌ పతాకాన్ని స్థాపించాను. మా బ్యానర్‌లో కథకు ప్రాధాన్యత ఉన్న సినిమాలనే నిర్మిస్తాం. ఇందులో స్టార్‌ డైరెక్టర్స్‌ సినిమాలు చేయరు.. నేను కూడా నా బ్యానర్‌లో నటించను. నాకు కథ నచ్చి, నేను చేయలేని సినిమాలను నా బ్యానర్‌లో నిర్మిస్తాను’’ అని నాని అన్నారు. విశ్వక్‌ సేన్, రుహానీ శర్మ జంటగా శైలేష్‌ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హిట్‌’. ‘ది ఫస్ట్‌ కేస్‌’ అన్నది ట్యాగ్‌ లైన్‌ . హీరో నాని సమర్పణలో వాల్‌ పోస్టర్‌ సినిమా పతాకంపై ప్రశాంతి త్రిపిర్‌నేని నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది.

ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో నాని మాట్లాడుతూ– ‘‘ఈరోజు మా సినిమా విడుదలవుతుండటంతో చాలా సంతోషంగా, నమ్మకంగా ఉన్నాం.  ప్రేక్షకుల స్పందన కోసం ఆత్రుతగా వేచి చేస్తున్నాం.. ‘హిట్‌’ అందరికీ నచ్చే చిత్రం అవుతుంది. సినిమా నచ్చి.. మళ్లీ మీ స్నేహితులతోనో, కుటుంబ సభ్యులతోనో వెళతారనే నమ్మకం ఉంది.  మా బ్యానర్‌లో కొత్త తరహాలో చేసిన ‘అ!’ సినిమాకు జాతీయ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. ఈసారి మరో కొత్త జానర్‌తో మీ ముందుకు వస్తున్నాం. నేను ఇప్పటి వరకు ఏడు సార్లు ‘హిట్‌’ సినిమా చూశాను.. ఒక్కసారి కూడా బోర్‌ కొట్టలేదు.

ప్రశాంతిగారిలాంటి వ్యక్తులు, మంచి టీమ్‌ ఉండబట్టే  నేను సినిమాల్లో నటిస్తూ,  నిర్మించగలిగాను’’ అన్నారు. ‘‘హిట్‌’ సినిమా  ప్రేక్షకులకు నచ్చుతుందనే భావిస్తున్నాం’’ అన్నారు ప్రశాంతి త్రిపిర్‌నేని. ‘‘ఈ రోజు మా చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్నా మా అందరి ముఖాల్లో చిరునవ్వు ఉందంటే సినిమాపై ఎంత నమ్మకంగా ఉన్నామో ప్రేక్షకులు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా’’ అన్నారు విశ్వక్‌ సేన్‌. ‘‘నిజాయతీగా తీసిన థ్రిల్లర్‌ ‘హిట్‌’. కథకు ఏది అవసరమో దాన్ని అందించారు నానీగారు. మా అందరి కష్టానికి తగిన ఫలితం దక్కుతుందని భావిస్తున్నాం’’ అన్నారు శైలేష్‌ కొలను. ‘‘ఈ సినిమా కోసం  చాలా కష్టపడ్డాం. మా చిత్రాన్ని పెద్ద హిట్‌ చేయాలని కోరుకుంటున్నా’’ అన్నారు రుహానీ శర్మ.

మరిన్ని వార్తలు