నాకు పదవీ వ్యామోహం లేదు

27 Nov, 2019 00:34 IST|Sakshi

‘‘ప్రస్తుతం తెలుగు సినిమా మంచి వెలుగులో ఉంది. టాలీవుడ్‌ నుంచి ప్యాన్‌ ఇండియా సినిమాలు వస్తున్నాయి. పరిశ్రమ ఇంత గొప్ప స్థాయికి ఎదుగుతుండటం మన తెలుగు వారందరికీ గర్వకారణం’’ అన్నారు నటుడు, ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌) అధ్యక్షుడు విజయకృష్ణ నరేష్‌ (సీనియర్‌ నరేష్‌). తెలుగు సినిమా పితామహుడు రఘుపతి వెంకయ్యనాయుడు జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘రఘుపతి వెంకయ్యనాయుడు’ చిత్రంలో నరేష్‌ టైటిల్‌ రోల్‌ చేశారు. బాబ్జీ దర్శకత్వంలో మండవ సతీష్‌బాబు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా నరేష్‌ చెప్పిన విశేషాలు.

►మా అమ్మ విజయనిర్మలగారికి రఘుపతి వెంకయ్య జాతీయ అవార్డు వచ్చినప్పుడు ఆయన విగ్రహం చూసి ఆయన గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకున్నాను. ఇంటర్‌నెట్‌లో శోధించి సినిమా కోసం ఆయన పడిన కష్టం, తపన, ఎదుర్కొన్న కష్టాలు తెలుసుకున్నాను. ఆయన జీవితాన్ని సినిమాగా తీస్తే బాగుంటుందని బాబ్జీకి చెప్పాను. సతీష్‌ నిర్మాతగా ముందుకు వచ్చారు. అలా ఈ సినిమా ప్రారంభమైంది.

►దాసరి నారాయణరావుగారు ఈ సినిమా చూసి నన్ను కౌగిలించుకున్నారు. ఈ సినిమాను దాసరిగారే విడుదల చేయాలనుకున్నారు. కానీ ఆయన మరణించడంతో విడుదల వాయిదా పడింది. రఘుపతి వెంకయ్యనాయుడుగారి పాత్రలో నటించడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సినిమాపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరుకుంటున్నాం. ఈ సినిమాను కొన్ని అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌కు పంపాలనే ఆలోచన కూడా ఉంది.

►నాకు ఎస్వీ రంగారావుగారు స్ఫూర్తి. ఆయనలా ఏ పాత్ర అయినా చేయగలను అని నిరూపించుకోవాలి. పాత్ర నచ్చితే లక్ష రూపాయలకైనా నటిస్తాను. నాకు రూపాయలు కాదు రోల్సే ముఖ్యం. ప్రస్తుతం 13 సినిమాలు చేస్తున్నాను. వెబ్‌ సిరీస్, షార్ట్‌ ఫిల్మ్స్‌ చేసే ఆలోచన ఉంది.

ఇది సమష్టి కృషి
‘మా’లో ఇరవై ఏళ్లు సభ్యుడిగా ఉన్నాను. ఓ సందర్భంలో జాయింట్‌ సెక్రటరీగా చేసి సక్సెస్‌ అయ్యాను. అలా నా ప్రయాణం మొదలైంది. ‘మా’ అధ్యక్షుడిగా నేను గెలిచిన రోజే చెప్పాను.. ఒక్కసారే చేస్తాను.. మళ్లీ రాను అని. ఎందుకంటే ఇది రాజకీయ సంస్థ కాదు. రాజకీయాలకు అతీతంగా నడపాలన్నది నా కోరిక. ఒక సేవా సంస్థగా నిలబడాలి. చిరంజీవిగారు నాటిన బీజం ఇది. దీన్ని ఎంతో మంది పైకి తీసుకువచ్చారు. నిధులు ఉన్నాయి. ‘మా’ అధ్యక్షుడిగా నేను బాధ్యతలు తీసుకున్న తర్వాత దాదాపు 850 మందికి జీవిత బీమా చేయడం జరిగింది. పాతికేళ్లలో ఇదే తొలిసారి. ఇది నేనొక్కడినే చేశానని చెప్పడం లేదు. సమష్టి కృషి. అయితే నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జరిగిందని చెబుతున్నాను. 300మందికి పైగా దాదాపు 3లక్షల వరకు ఆరోగ్య బీమా కల్పించాం. పెన్షన్లు ఆరు వేలు చేశాం.

నేను అజాత శత్రువు
రెండు ప్యానెల్స్‌గా పోటీ చేసినప్పుడు అధిపత్య పోరు, ఆలోచనల్లో తేడా రావడం సహజం. ‘మా’ అధ్యక్షుడిగా అందరినీ కలుపుకుపోవడం నా బాధ్యత. చిరంజీవి, కృష్ణంరాజు, మురళీమోహన్, మోహన్‌బాబుగార్ల వంటివారు ‘మా’పై చూపిస్తున్న ప్రేమ మాకు కొండంత అండ. సభ్యుల సహకారంతో ‘మా’ను ఒక సేవాసంస్థగా ముందుకు తీసుకెళ్లడమే అధ్యక్షుడిగా నా బాధ్యత. నేను ఎటువంటి వివాదాలకు పోను. నేను చేయాల్సినవి ఆరు నెలల్లోనే చేశా. ‘మీ అధ్యక్ష పదవి కాలం పూర్తి కాకుండానే మిమ్మల్ని ‘మా’ అధ్యక్షుడు హోదా నుంచి దింపేయాలని కొందరు ప్రయత్నించారంటూ కొన్ని వార్తలు వచ్చాయి కదా’ అనే ప్రశ్నకు – ‘‘దింపేయాలని కాదు. అందరూ కోరితే నేను ఇవాళ కూడా ‘మా’ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటాను.

ఎవరూ నన్ను బయటకు పంపించలేరు. ఎందుకంటే నేను నామినేటెడ్‌ లీడర్‌ని కాను. ఎలక్షన్‌లో ఎన్నుకోబడ్డ నాయకుణ్ని. నాకు పదవీ వ్యామోహం లేదు. మా అమ్మగారు మరణించి ఆరు నెలలు కూడా పూర్తి కాలేదు. ఆ ఇబ్బందులు కూడా కొన్ని ఉన్నాయి మాకు. ఇవన్నీ దాటి నేను చేస్తున్నాను. అందరి సహకారం కోరుకుంటున్నాను. అందరూ ఇస్తున్నారు.  నరేష్‌కు అజాత శత్రువు అనే పేరు ఉంది. ఏ క్యాంపులోకి అయినా వెళ్లగలను. ఈర్ష్య, ద్వేషాలు నాకు లేవు. జీవితంలో చాలా చూశాను. నేను గొప్ప నాయకుణ్ణి అని చెప్పుకోవడం లేదు. ‘మా’ 850 కుటుంబాలకు చెందిన సంస్థ... కలిసిపోదాం. కలిసి పని చేద్దాం’’ అన్నారు నరేష్‌.

మరిన్ని వార్తలు