‘@నర్తనశాల’ మూవీ రివ్యూ

30 Aug, 2018 12:42 IST|Sakshi

టైటిల్ : @నర్తనశాల
జానర్ : కామెడీ ఎంటర్‌టైనర్‌
తారాగణం : నాగశౌర్య, కశ్మీరా, యామినీ భాస్కర్‌, శివాజీ రాజా, అజయ్‌, జయప్రకాష్ రెడ్డి
సంగీతం : మహతి స్వర సాగర్‌
దర్శకత్వం : శ్రీనివాస చక్రవర్తి
నిర్మాత : ఉషా ముల్పూరి

ఛలో సినిమాతో సూపర్‌ ఫాంలోకి వచ్చినట్టుగా కనిపించిన యంగ్ హీరో నాగశౌర్య తరువాత అమ్మమ్మగారిళ్లు, కణం లాంటి సినిమాలతో కాస్త తడబడ్డాడు. అయితే ఆ సినిమాల ప్రభావం నాగశౌర్య కెరీర్‌ మీద పెద్దగా కనిపించలేదు. అందుకే తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘@నర్తనశాల’ సినిమాపై మంచి హైప్‌ క్రియేట్‌ అయ్యింది. నాగశౌర్య డిఫరెంట్‌ రోల్‌లో కనిపించిన @నర్తనశాల ఈ యంగ్ హీరో ఖాతాలో మరో సూపర్‌ హిట్‌గా నిలిచిందా..? కొత్త దర్శకుడు శ్రీనివాస చక్రవర్తి గే కామెడీతో ఏ మేరకు ఆకట్టుకున్నాడు..?

కథ ;
కళామందిర్‌ కల్యాణ్ (శివాజీ రాజా).. ఓ కూతుర్ని కని తన తండ్రి చేతిలో పెట్టాలని కలలు కంటుంటాడు. కల్యాణ్ తండ్రి చనిపోయిన తన భార్య మనవరాలిగా తిరిగి తన ఇంట్లోనే పుడుతుందన్న నమ్మకంతో ఉంటాడు. కానీ కల్యాణ్ భార్య(ప్రియ) మగ బిడ్డకు జన్మనిస్తుంది. ఈ విషయం తెలిస్తే తండ్రి గుండె ఆగిపోతుందని అబ్బాయినే అమ్మాయిగా తండ్రిని నమ్మిస్తాడు కల్యాణ్. కొడుకును కూతురిలాగే పెంచి పెద్ద చేస్తుంటాడు. ఓ బుడబుక్కల వాడితో సరదాగా మా అమ్మాయికి ఎలాంటి మొగుడు వస్తాడో చెప్పాలని అడిగిన కల్యాణ్‌కు అనుకొని సమాధానం ఎదురవుతుంది. ఆ బుడబుక్కల వాడు అబ్బాయిని అమ్మాయిగా చూపించి మోసం చేస్తున్నావు.. నిజంగానే ఈ అబ్బాయికి తోడుగా అబ్బాయే వస్తాడు అని చెప్పి వెళ్లిపోతాడు.

పెరిగి పెద్దవాడైన కల్యాణ్.. కొడుకు (నాగశౌర్య) అమ్మాయిల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు ఓ క్లబ్‌ను నిర్వహిస్తుంటాడు. ఆడపిల్లకు ఏ సమస్య వచ్చినా తానే ముందుండి పరిష్కరిస్తుంటాడు. అలా ఓ సమస్య నుంచి మానస (కశ్మీర)ను రక్షించి ఆమెతో ప్రేమలో పడతాడు. కానీ కల్యాణ్ చేసిన ఓ తింగరి పని వల్ల నాగశౌర్య.. దందాలు చేసే జయప్రకాష్ రెడ్డి కూతురు సత్య(యామినీ భాస్కర్‌)ని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. మరి ఇలాంటి పరిస్థితుల నుంచి నాగశౌర్య ఎలా బయటపడ్డాడు.? నాగశౌర్య కు గే లా నటించాల్సి అవసరం ఎందుకు వచ్చింది..? బుడబుక్కల వాడు చెప్పిందే నిజమైందా.? చివరకు నాగశౌర్య, మానసలు ఎలా ఒక్కటయ్యారు? అన్నదే మిగతా కథ. 

నటీనటులు ;
ఛలో సినిమాతో సూపర్‌ హిట్‌ సాధించిన నాగశౌర్య అదే కాన్ఫిడెన్స్‌ తో మరోసారి తన సొంత నిర్మాణ సంస్థలో @నర్తనశాల సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హీరోగానే కాక నిర్మాతగానూ బాధ్యతగా వ్యవహరించాడు. హీరోయిజంతో పాటు గే  కామెడీ కూడా బాగానే పండించాడు. అయితే తన పూర్తి స్థాయిని ప్రూవ్ చేసుకునే సన్నివేశాలు దక్కలేదు. చాలా రోజుల తరువాత అజయ్‌కి ఫుల్‌ లెంగ్త్‌ రోల్‌ దక్కింది. రఫ్‌ లుక్‌లో కనిపిస్తూనే కామెడీతోనూ ఆకట్టుకున్నాడు అజయ్‌. హీరోయిన్లుగా నటించిన కశ్మీర, యామినీ భాస్కర్‌లు నటన పరంగా పెద్దగా మెప్పించలేకపోయినా.. గ్లామర్‌ షోతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. హీరో తండ్రిగా కనిపించిన సీనియర్‌ నటుడు శివాజీ రాజాను దర్శకుడు సరిగా  వినియోగించుకోలేదు. జయప్రకాష్ రెడ్డి, సుధా, ప్రియా రొటీన్‌ పాత్రల్లో కనిపించారు.
మరిన్ని రివ్యూల కోసం క్లిక్‌ చేయండి

విశ్లేషణ ;
ఛలో సినిమాతో సూపర్‌ ఫాంలో ఉన్న నాగశౌర్య మరోసారి సొంత నిర్మాణ సంస్థలో సినిమా చేస్తున్నాడంటే ఆ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే అంచనాలు అందుకోవటంలో @నర్తనశాల టీం పూర్తిగా విఫలమైంది. లవర్ బాయ్ ఇమేజ్‌ ఉన్న నాగశౌర్య గే తరహా పాత్రలో నటించే సాహసం చేసినా ఆ ప్రయత్నం వృథా అయ్యింది. అవుట్‌ అండ్‌ కామెడీ ఆశించి థియేటర్లకు వచ్చిన ప్రేక్షకులను దర్శకుడు శ్రీనివాస చక్రవర్తి నిరాశపరిచాడు. కథా పరంగా మంచి కామెడీ పండించే అవకాశం ఉన్నా.. దర్శకుడు కథనాన్ని సాధాసీదాగా నడిపించాడు. ఫస్ట్‌హాఫ్‌లో హీరో హీరోయిన్ల లవ్‌ స్టోరి.. కొన్ని కామెడీ సీన్స్‌ ఆకట్టుకున్నా ద్వితీయార్థం మరింత రొటీన్‌గా అనిపిస్తుంది. కథనం ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా సాగుతూ నిరాశపరుస్తుంది. ఛలో సినిమాకు భారీ హైప్‌ రావటంలో హెల్ప్‌ అయిన సంగీత దర్శకుడు మహతి ఈ సినిమాతో ఆ మ్యాజిక్‌ను రిపీట్ చేయలేకపోయాడు. ఒకటి రెండు పాటలు విజువల్‌గా ఆకట్టుకున్నా గుర్తుండిపోయే రేంజ్‌లో మాత్రం లేవు. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు బాగున్నాయి.

ప్లస్‌ పాయింట్స్‌ ;
నిర్మాణ విలువలు
రెండు పాటలు

మైనస్‌ పాయింట్స్‌ ;
కథా కథనాలు
కామెడీ ఆశించిన స్థాయిలో లేకపోవటం
స్లో నేరేషన్‌

సతీష్‌ రెడ్డి జడ్డా, ఇంటర్‌నెట్‌ డెస్క్‌.

Poll
Loading...
మరిన్ని వార్తలు