ఏ పాత్రకి అదే ప్రత్యేకం

28 Aug, 2018 00:43 IST|Sakshi
యామినీ భాస్కర్‌, కశ్మీరా పరదేశి

కశ్మీరా పరదేశి, యామినీ భాస్కర్‌... ఈ నెల 30న విడుదల కానున్న ‘నర్తనశాల’లో మెరవబోతున్న కథానాయికలు. నాగశౌర్య హీరోగా శ్రీనివాస చక్రవర్తి దర్శకత్వంలో శంకర ప్రసాద్‌ ముల్పూరి సమర్పణలో ఉషా ముల్పూరి నిర్మించారు. కశ్మీరా పరదేశి మాట్లాడుతూ – ‘‘నా మాతృభాష మరాఠి. పూణెలో పుట్టి, పెరిగా. ముంబై నిఫ్ట్‌లో ఫ్యాషన్‌ డిజైనింగ్‌ చదువుతున్నప్పుడే మోడలింగ్‌ చేశా. ‘నర్తనశాల’ ఆడిషన్స్‌కి వచ్చా. నవరసాలను అభినయించమన్నారు.

చేయగానే నచ్చడంతో కథానాయికగా తీసుకున్నారు. కాస్ట్యూమ్స్‌ విషయంలో ఉషా ఆంటీ సాయం చేశారు. దర్శకుడు చక్రవర్తిగారు నాకు గురువులాంటివారు. ఈ చిత్రంలో నా పాత్ర లవబుల్‌గా, ఇన్నోసెంట్‌గా ఉంటుంది. నా ప్రేమికుడే నా బలం అన్నట్టు ఉంటుంది. మరో హీరోయిన్‌ యామినీ ఉన్నప్పటికీ ఏ పాత్రకి అది స్పెషల్‌ అన్నట్లుగా ఉంటాయి. నాకు హిప్‌హాప్, కథక్‌ డ్యాన్సులు వచ్చు. ప్రస్తుతం తమిళంలో ఓ సినిమా చేస్తున్నా’’ అన్నారు.

యామినీ భాస్కర్‌ మాట్లాడుతూ – ‘‘నేను పుట్టి, పెరిగింది విజయవాడ. గతంలో ‘కీచుక’ అనే సినిమా చేశా. అందులో నా నటనకి మంచి అభినందనలు వచ్చాయి. కానీ, ఆ సినిమా అనుకున్నంత సక్సెస్‌ కాలేదు. ‘నర్తనశాల’ నా కెరీర్‌కి ప్లస్‌ అవుతుందనే నమ్మకం ఉంది. ఇందులో ఏ ప్రాబ్లమ్‌ వచ్చినా ఒక అమ్మాయి ధైర్యంగా ఉండాలి, ఎదుర్కోవాలి అనుకునే పాత్ర. ప్రత్యేకించి కొన్ని యాక్షన్‌ సీక్వెన్సెస్‌ కోసం ప్రాక్టీస్‌ చేశాను. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్‌ ఉన్నా రెండు పాత్రలకి మధ్య వేరియేషన్‌ ఉంటుంది. ఏ పాత్రకి అదే ప్రత్యేకం. ప్రస్తుతం మారుతిగారి దర్శకత్వంలో చేసిన ‘భలే మంచి చౌకబేరం’ సెప్టెంబర్‌లో విడుదలవుతుంది’’ అన్నారు.

మరిన్ని వార్తలు