భూమిపై శాస్త్రజ్ఞుల సినిమా

24 Apr, 2016 17:49 IST|Sakshi
భూమిపై శాస్త్రజ్ఞుల సినిమా

వాషింగ్టన్: ఎప్పుడూ ఏదో ఒక అంశంపై పరిశోధనలు చేసే శాస్త్రజ్ఞులు తాజాగా ఓ సినిమాను నిర్మించే పనిలో పడ్డారు. 'బ్యూటిఫుల్ ప్లానెట్' పేరుతో అమెరికాలోని నాసాకు చెందిన శాస్త్రజ్ఞులు భూమిని గురించిన విషయాలను ప్రధానంగా ఇందులో చూపనున్నారు.

భూమిపై మానవుడు వివిధ పరిణామ క్రమాల్లో చూపిన ప్రభావాలను పగటిపూట విధుల నిర్వహణ అనంతరం రాత్రి సమయాల్లో, సెలవు దినాల్లో ఈ సినిమాను పరిశోధకులు చిత్రీకరించారు. ఈ నెల 29నుంచి ఈ చిత్రం అమెరికాలోని థియేటర్లలో ప్రదర్శించేందుకు శాస్త్రజ్ఞులు ఐమ్యాక్స్తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు.

నాసాలో పనిచేసే క్జేల్ లిండ్ర్గేన్, టెర్రీ విర్స్ట్, బారీ విల్మోర్, నాసా పూర్వపు ఆస్ట్రోనాట్ స్కాట్ కెల్లీలు ప్రఖ్యాత హాలీవుడ్ డైరెక్టర్ టోనీ మైర్స్, ఫోటోగ్రఫీ డైరెక్టర్ జేమ్స్ల వద్ద ట్రైయినింగ్ తీసుకుని ఈ చిత్రాన్ని నిర్మించారు. కదిలే భూమి ఎంత సున్నితమైనదో ఈ చిత్రం ప్రజలకు తెలియజేస్తుందని నాసా ఓ ప్రకటనలో తెలిపింది. అంతరిక్షం నుంచి భూమి కదలికలను చిత్రించడం కష్టతరం కావడం చేత ఆ సన్నివేశాలను చిత్రించేందుకు దాదాపు మూడు సంవత్సరాల సమయం పట్టిందని నాసా వివరించింది.