నా వల్లే నువ్వోడిపోయావ్‌..

10 Jan, 2019 02:13 IST|Sakshi
పరుచూరి ప్రవీణ , మహా వెంకటేశ్‌

గతేడాది రిలీజైన ‘కేరాఫ్‌ కంచరపాలెం’ ఆడియన్స్‌కు ఎంతగా నచ్చిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. 2018లో వచ్చిన ఉత్తమ చిత్రమంటూ పొగడ్తల వర్షాలు కురిపించారు. రానా సమర్పించిన ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు మహా వెంకటేశ్‌ డైరెక్ట్‌ చేయగా, తెలుగు మూలాలున్న అమెరికన్‌ డాక్టర్‌ పరుచూరి ప్రవీణ నిర్మించారు. ఈ ఏడాది నేషనల్‌ అవార్డ్స్‌ లిస్ట్‌లో ‘కేరాఫ్‌ కంచరపాలెం’ సెలెక్ట్‌ కాలేదు. కారణం నిర్మాత అమెరికన్‌ కావడమే. ఈ విషయాన్ని ట్వీటర్‌లో పేరొన్నారు ప్రవీణా పరుచూరి.

‘‘సారీ వెంకటేశ్‌ మహా. కేవలం నా వల్ల నీ కష్టాన్ని, శ్రమని నేషనల్‌ అవార్డ్‌  వాళ్లు అనర్హంగా భావించారు. నా వల్లే నువ్వోడిపోయావ్‌. నేనే నిన్ను ఓడిపోయేలా చేశాను’’ అని తన బాధను వ్యక్తపరిచారు. దీనికి దర్శకుడు వెంకటేశ్‌ మహా సమాధానమిస్తూ – ‘‘అది మీ తప్పు కాదు. ఇంకా ఆ పాత రూల్స్‌తోనే నడుస్తున్న మన దేశానిది. ఒక ఇండియన్‌ డైరెక్టర్, ఇండియన్‌ యాక్టర్స్‌తో ఇండియా వాళ్ల కోసం తీసిన సినిమా ఇండియన్‌ నేషనల్‌ అవార్డ్స్‌కు అర్హత సాధించకపోవడమేంటో నాకు అర్థం కావడం లేదు. మార్పుకు సమయం ఆసన్నమైంది’’ అని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు