అతడి జీవితమే బ్లాక్‌మెయిల్, నీలిచిత్రాలు

26 Aug, 2016 09:33 IST|Sakshi
అతడి జీవితమే బ్లాక్‌మెయిల్, నీలిచిత్రాలు

తమపై సినీ నిర్మాత నట్టి కుమార్ చేసిన ఆరోపణలను మరో నిర్మాత సి. కళ్యాణ్ ఖండించారు. నట్టి కుమార్‌పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. అసలు ఇప్పుడంతా నయీం బాధితులని అంటున్నారు గానీ, నట్టికుమార్ బాధితుల కోసం అని ఒక సెల్ తెరిస్తే, ఒక నెంబరు ఇస్తే.. నయీం బాధితుల కంటే ఎక్కువ మంది వస్తారని చెప్పారు. కుమార్ జీవితం అంతా బ్లాక్‌మెయిల్, నీలిచిత్రాల మయమని ఆరోపించారు. తన సినిమాల్లో నటించే అమ్మాయిలను కూడా నగ్నచిత్రాలతో బ్లాక్‌మెయిల్ చేస్తారన్నారు. తమపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, ఆధారాలుంటే వాటిని బయటపెట్టాలని డిమాండ్ చేశారు. కుమార్ వ్యవహారంపై ఫిలిం ఛాంబర్ కార్యవర్గ సమావేశంలో చర్చించి తమిళనాడు, ఆంధ్రా, తెలంగాణ ప్రభుత్వాలకు ఇవ్వబోతున్నామన్నారు. తమిళనాడులో కూడా ఇతడికి సినిమా సంబంధాలతో పాటు.. అక్కడ కేసులు వేసి బ్లాక్ మెయిల్ చేసిన సందర్భాలున్నాయని తెలిపారు. నయీంతో లింకులు ఉన్నవాళ్లు సినిమా పరిశ్రమలో ఎంతటి పెద్దవాడైనా అదుపులోకి తీసుకుని ప్రశ్నించి, శిక్షించవచ్చని తెలుగు సినీ పరిశ్రమ తరఫున చెబుతున్నామన్నారు.

అసలు నట్టికుమార్ కుటుంబమే మోసాలు చేస్తుందని సి.కళ్యాణ్ ఆరోపించారు. ఆయన కొడుకు అమెరికాలో చదువుకోడానికి వెళ్తుంటే ఫోన్ చేసి, ఏదో ప్రాజెక్టు రిపోర్టు చేయాలంటూ తాను తీసిన ఎటో వెళ్లిపోయింది మనసు క్లిప్పింగులు కావాలని అడిగారని.. సరే కదా అని ఇస్తే ఆ సినిమాను నెట్‌లో పెట్టారని చెప్పారు. దీనిపై తన భాగస్వాములు నెట్‌లో సినిమా ఉందేంటని అడిగారన్నారు. దాంతో నట్టి కుమార్‌కు తాను ఫోన్ చేసి, నీ కొడుకును అరెస్టు చేసే పరిస్థితి వస్తోందని చెబితే.. బతిమిలాడుకుని తీసేశాడని చెప్పారు. క్రైస్తవ మతం పేరు చెప్పుకొని డబ్బులు దండుకోవడం, అన్నదానాల పేరుతో వసూళ్లు నిజం అవునా కాదా అని ప్రశ్నించారు. పోస్టర్లు వేసుకుని ఆ పేరుతో డబ్బులు దండుకుంటారన్నారు.

సినీ పరిశ్రమలో చాలామంది నట్టి కుమార్ బాధితులు ఉన్నారని, ఎవరూ కూడా ఎందుకులే అని ప్రెస్ ముందుకు రావడం లేదని తెలిపారు. విశాఖలో బ్యాంకులలో ఓవర్ డ్రాఫ్టుల పేరుతో ఓ కుంభకోణం జరిగిందని, అది త్వరలోనే బయటకు రానుందని అన్నారు. వైజాగ్ నుంచి ఇతడిని తన్ని తరిమేశారని చెప్పారు. అతడు థియేటర్ కొన్నట్లు చెబితే తాను ఓపెనింగ్‌కు వెళ్లానని, కానీ ఆ థియేటర్ లీజుకు తీసుకున్నట్లు ఆ తర్వాత తెలిసిందని అన్నారు. వాటి పేరుతో బ్యాంకుల్లో ఓవర్‌డ్రాఫ్ట్ లావాదేవీలు నడిపించాడని చెప్పారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి