‘అర్దరాత్రి నుంచే ప్రత్యేక షోలు’ 

11 Dec, 2019 21:24 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : పలు వివాదాల నడుమ ఎట్టకేలకు సెన్సార్‌ బోర్డు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో ‘అమ‍్మరాజ్యంలో కడప బిడ్డలు’  చిత్రం బుధవారం అర్థరాత్రి నుంచే ప్రేక్షకుల ముందుకు రానుంది. నిర్మాత నట్టికుమార్‌ ఈ సందర్భంగా  ఆర్జీవీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.  నట్టికుమార్‌  మాట్లాడుతూ... ‘అమ్మరాజ్యంలో కడప బిడ్డలు సినిమాను 1200 థియేటర్లలో విడుదల చేస్తున్నాం. అర్థరాత్రి నుంచే సినిమా ప్రదర్శన ఉంటుంది. ఈ సినిమా విడుదల అనంతరం ఓ రాజకీయ పార్టీకి ప్రతిపక్ష హోదా పోతుంది. 

సినిమా విడుదలను ఆపేందుకు రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలామంది వ్యక్తులు ప్రయత్నించారు. అయితే మాకు ముంబై నుంచి రివైజింగ్‌ కమిటీ సెన్సార్‌ సర్టిఫికెట్‌ ఇచ్చింది. దీన్ని కూడా రాజకీయం చేయాలని చూశారు. చివరికి న్యాయం గెలిచి సినిమా విడుదల అవుతోంది. మా సినిమా కుల, మతాలను కించపరిచేలా ఉండదు. కేవలం హాస్యభరితంగా మాత్రమే ఉంటుంది. సినిమాను ఆపడానికి ప్రయత్నించిన వారిపై చట్టబద్ధంగా ఎదుర్కొంటాం. ’ అని తెలిపారు. 

ప్రస్తుతం చైనా పర్యటనలో ఉన్న రాంగోపాల్‌ వర్మ మాట్లాడుతూ.. ‘మా సినిమాను ఆపడానికి ఎవరు ప్రయత్నించారో వాల్లపై లీగల్‌గా ప్రొసీడ్‌ అవుతాం. వాళ్లపై త‍్వరలోనే కేసులు పెట్టబోతున్నాం. అసెంబ్లీలో జరుగుతున్న కామెడీని ఏ డైరెక్టర్‌ సినిమాగా తీయలేడు. ఫైనల్‌గా సినిమా విడుదల అవుతోంది’ అని తెలిపారు.

చిత్ర సమర్పకులు అంజయ్య మాట్లాడుతూ... రాంగోపాల్‌ వర్మ ఎవరిని టార్గెట్‌ చేసి ఈ సినిమా తీయలేదు. అన్నివర్గాల ప్రేక్షకుల్ని  ‘అమ‍్మరాజ్యంలో కడప బిడ్డలు’  చిత్రం ఆకట్టుకుంటుదని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్ర సహా నిర్మాత నట్టికుమార్, సమర్పకులు అంజయ్య,కేఏ పాల్ పాత్రధారి రాము తదితరులు పాల్గొన్నారు. కాగా పలు నాటకీయ పరిణామాల మధ్య బుధవారం రాత్రి  సెన్సార్‌ బోర్డు సభ్యులు  ‘అమ‍్మరాజ్యంలో కడప బిడ్డలు’  చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్‌ జారీ చేసిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు