నవాజుద్దీన్‌ తీరుకి షాకయ్యా

11 Nov, 2018 02:50 IST|Sakshi
నిహారికా సింగ్‌, నవాజుద్దిన్‌ సిద్ధిఖీ

నవాజుద్దిన్‌ సిద్ధిఖీ.. ప్రస్తుతం బాలీవుడ్‌లో వెర్సటైల్‌ యాక్టర్‌. నవాజుద్దిన్‌ సినిమా ఓకే చేశాడంటే ఆ సినిమాలో ఎదో స్పెషాలిటీ ఉన్నట్టే అనే పేరు తెచ్చుకున్నారు. ఇటీవలే రచయిత ‘మంటో’ పాత్ర పోషించి చప్పట్లు కొట్టించుకున్నారు. తాజాగా ఈ నటుడిపై వేధింపుల ఆరోపణలు చేశారు మాజీ మిస్‌ ఇండియా నిహారికా సింగ్‌. ఆల్రెడీ నవాజుద్దిన్‌  సిద్ధిఖీ తన ఆటోబయోగ్రఫీ ‘యాన్‌ ఆర్డినరీ లైఫ్‌’ లో నిహారికా సింగ్‌తో ఉన్న సంబంధం గురించి రాసుకొచ్చారు. ఇంకా మరో ఇద్దరు ముగ్గురి గురించి కూడా ఈ పుస్తకంలో ఆయన ప్రస్తావించారు. 

దాంతో మా అనుమతి లేకుండా పుస్తకంలో మా గురించి రాశారని సంబంధిత వ్యక్తులు పేర్కొనడంతో అప్పటికే స్టాల్స్‌కి వెళ్లిన ఆ పుస్తకాలను పబ్లిష్‌ చేసిన సంస్థ వెనక్కి తెప్పించింది. ఇప్పుడు జరుగుతున్న ‘మీటూ’ ఉద్యమంలో భాగంగా తన కథను చెప్పుకొచ్చారు నిహారికా సింగ్‌.  చిన్నప్పటి నుంచి తాను ఎదుర్కొన్న అనుభవాలను విశ్లేషిస్తూ రాసుకొచ్చారు. అందులోని సారాంశం ఏంటంటే..  ‘‘బాలీవుడ్‌లో నటిగా ఎదుగుదాం అనుకున్న రోజుల్లో ‘మిస్‌ లవ్లీ’ అనే సినిమా అవకాశం వచ్చింది.

నవాజుద్దిన్‌ అనే నటుణ్ణి అప్పుడే ఫస్ట్‌ టైమ్‌ కలిశాను. తను గొప్ప నటుడు అనుకోలేదు. తను నటించిన  షార్ట్‌ ఫిల్మ్‌ సీడీ నాకు ఇచ్చాడు. అప్పటి నుంచి ఆయన మీద ఒకలాంటి గౌరవం ఏర్పడింది. మరుసటిరోజు నన్ను భోజనానికి ఆహ్వానించాడు. ఫిల్మీ ప్రపంచంలో ఆయనతో మాట్లాడుతుంటే చాలా నిజమైన వ్యక్తిగా తోచాడు. కొన్ని రోజుల తర్వాత షూటింగ్‌ నిమిత్తం మా అపార్ట్‌మెంట్‌ దగ్గరకు వచ్చానని ఆయన మెసేజ్‌ చేయడంతో మా ఇంటికి ఆహ్వానించాను. ఇంటికి రావడంతోనే నన్ను గట్టిగా కౌగిలించుకున్నాడు. నేను షాకయ్యా.

తనని వెనక్కి తోసేయాలనుకున్నా కూడా అది విఫల ప్రయత్నమే అయింది. ‘పరేశ్‌ రావల్, మనోజ్‌ బాజ్‌పాయిలా మిస్‌ ఇండియానో, హీరోయిన్‌నో పెళ్లి చేసుకోవాలనుంది’ అన్నాడు నవాజుద్దిన్‌. అప్పటికి తను ఇన్‌సెక్యూర్డ్‌గా ఉండేవాడు. తన లుక్స్, స్కిన్‌ కలర్, ఇంగ్లీష్‌ చూసి ఇండస్ట్రీ ఏమంటుందో అని బాధపడేవాడు. అందులో నుంచి బయటకు రావడానికి నేను కొంత సాయం చేశాను. మెల్లిగా అతను చెబుతున్నవన్నీ అబద్ధాలని తెలియడం మొదలైంది. కేవలం నాతోనే కాదు చాలా మంది స్త్రీలతో రిలేషన్‌షిప్‌లో ఉన్నాడనీ,  ఒక అమ్మాయిని వివాహం కూడా చేసుకున్నాడని తెలుసుకున్నాను.

కట్నం కోసం వేధిస్తున్నాడని వాళ్లు విడిపోయారు. నేను అతన్ని నిజాయతీగా ఉండమన్నాను. అలా ఉండేంతవరకూ నిన్ను  కలవనని కూడా చెప్పాను. ఆ తర్వాత మేం నటించిన ‘మిస్‌ లవ్లీ’ కాన్స్‌ ఫిల్మ్‌  ఫెస్టివల్‌కు ఎంపిక అయింది. మళ్లీ మూడేళ్లకు అప్పుడే కలుసుకున్నాం. తను ప్రవర్తించిన తీరుకు పశ్చాత్తాపపడ్డాడు. ఆ తర్వాత ‘అన్వర్‌ కా అజాబ్‌ కిస్సా’ అనే చిత్రంలో నాకో పాత్ర రికమెండ్‌ చేశాడు. ఆ సమయంలో మళ్లీ నాతో కనెక్ట్‌ అవ్వాలని ప్రయత్నించాడు. తనతో ఉండమని బతిమాలాడు. కానీ ఫ్రెండ్‌లా అయితే ఉంటానని చెప్పాను. ఆ సినిమా రిలీజ్‌ కాలేదు. నేనంత గొప్ప నటి కాదని అందరితో చెప్పడం మొదలెట్టాడు. నా అవకాశాలు తగ్గాయి. మమ్మల్ని సంప్రదించకుండానే తన పుస్తకంలో తనకు నచ్చినట్టుగా మా గురించి రాసుకొచ్చాడు’’ అని పేర్కొన్నారు నిహారికా సింగ్‌.

>
మరిన్ని వార్తలు