నయనతారపై విమర్శకుల గురి

25 Jun, 2019 12:55 IST|Sakshi

విమర్శకుల దృష్టి ఇప్పుడు నయనతారపై పడింది. దక్షిణాదిలో అగ్రనటిగా రాణిస్తున్న నటి నయనతార. జయాపజయాలకు అతీతంగా అవకాశాలు తలుపుతడుతున్నాయి. తమిళంలోనే ఇటు సూపర్‌స్టార్‌తో, అటు దళపతి విజయ్‌తో ఏకకాలంలో నటిస్తున్న నటి ఈమె. ఆ మధ్య తన చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో సీనియర్‌ నటుడు రాధారవి మాట్లాడుతూ నయనతార ఒక చిత్రంలో దెయ్యంగానూ, మరో చిత్రంలో సీతగానూ నటిస్తున్నారని అన్నారు. ఇప్పుడు సీతగా ఎవరైనా నటించవచ్చుననీ, ఇంతకు ముందు సీతగా నటించాలంటే కేఆర్‌.విజయనే ఎంపిక చేసేవారని అన్నారు. ఇప్పుడైతే నమస్కరించేవారూ నటించవచ్చు, అందుకు భిన్నమైన వారూ నటించవచ్చునని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలు కోలీవుడ్‌లో పెద్ద చర్చకే దారితీశాయి. చాలా మంది ప్రముఖులు రాధారవి వ్యాఖ్యలను ఖండించారు.

సాధారణంగా ఏ విషయం గురించి పెద్దగా పట్టించుకోని నయనతార ఈ వ్యవహారంపై తీవ్రంగా ధ్వజమెత్తింది. వెంటనే రాధారవికి వ్యతిరేకంగా ఒక ప్రకటన చేసింది. అందులో ఇకపై మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయరని భావిస్తున్నానని పేర్కొంది. అంతేకాదు నడిగర్‌ సంఘాన్ని గట్టిగానే ప్రశ్నించింది. సంఘం తమకు వృత్తిపరంగా సహకరించే విషయం గురించి కఠిన నిర్ణయాలు తీసుకోవాలని ఇంతకుముందే ఒక లేఖ ద్వారా తెలియజేశానని, సుప్రీంకోర్టు వెల్లడించినట్లు నడిగర్‌ సంఘం ద్వారా ఒక ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేస్తారా? విశాఖా కమిటీ సూచనల మేరకు ఆరోపణలు చేసిన వారిని విచారిస్తారా? అని ప్రశ్నించింది. దీనికి స్పందించిన నడిగర్‌సంఘం వెంటనే రాధారవి వ్యాఖ్యలను ఖండిస్తూ లేఖ రాసింది. కాగా ఆదివారం జరిగిన నడిగర్‌ సంఘం ఎన్నికల్లో పలువురు ప్రముఖ నటీనటులు తమ ఓటు హక్కును వినియోగించుకున్న నేపధ్యంలో నయనతార ఓటు వేయడానికి రాలేదు. దీంతో తనకు సమస్య వచ్చినప్పుడు నడిగర్‌సంఘంను ప్రశ్నించిన నయనతార, అదే బాధ్యతతో ఓటు వేయడానికి రావాలి కదా అనే ప్రశ్న తలెత్తుతోంది. నయనతార ఇప్పుడే కాదు గత ఎన్నికల్లోనూ ఓటు వేయలేదు. దీంతో ఒకరిని ప్రశ్నించే హక్కు ఉన్నప్పుడు తన బాధ్యతను కూడా  నిర్వహించాలిగా అంటూ ఈ సంచలన నటిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  
 

>
మరిన్ని వార్తలు