ఆమె అయితేనే బాగుంటుంది

26 Mar, 2016 16:51 IST|Sakshi
ఆమె అయితేనే బాగుంటుంది

తొమ్మిదేళ్ల తరువాత మళ్లీ నయనతారతో కలిసి నటిస్తున్నానని యువ నటుడు జీవా పేర్కొన్నారు. వీరిది హిట్ జంట. ఇంతకు ముందు 'ఈ' చిత్రంలో తొలిసారిగా కలసి నటించారు. ఆ చిత్రం అప్పట్లో మంచి విజయాన్ని సాధించింది. ఆ తరువాత ఇన్నాళ్లకు తిరునాళ్ అనే చిత్రంలో నటిస్తున్నారు. దీన్ని సూపర్‌గుడ్ ఫిలింస్ సంస్థలో పలు సంవత్సరాలు నిర్వహణ బాధ్యతలు నిర్వహించిన ఎం.సెంథిల్‌కుమార్ నిర్మాతగా మారి కోదండపాణి ఫిలింస్ పతాకంపై నిర్మిస్తున్నారు.

అంబాసముద్రపు అంబానీ చిత్రం ఫేమ్ పీఎస్.రామనాథ్ కథ, కథనం,దర్శకత్వం బాధ్యతలు చేపట్టిన ఈ తిరునాళ్‌కు 'శ్రీ'గా పేరు మార్చుకున్న శ్రీకాంత్‌దేవా సంగీతాన్ని, మహేశ్ ముత్తుసామి చాయాగ్రహణం అందిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం వివరాలను చెన్నైలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్ర యూనిట్ వెల్లడించారు. చిత్ర హీరో జీవా మాట్లాడుతూ ఒక మంచి పాజిటివ్ టీమ్‌తో చేస్తున్న కమర్షియల్ చిత్రం తిరునాళ్ అని చెప్పారు. సెంథిల్‌కుమార్‌ను నిర్మాత అనడం కంటే తన కుటుంబసభ్యుడిగా పేర్కొనవచ్చు అని అన్నారు. తమ సూపర్‌గుడ్ ఫిలింస్ సంస్థ నిర్మించిన చి త్ర విజయాలన్నిం టి వెనుక సెంథిల్‌కుమార్ ఉన్నారని పేర్కొన్నారు.

ఇక తిరునాళ్ చిత్రం విషయానికొస్తే గ్రామీణ నేపథ్యంలో సాగే కుటుం బకథా చిత్రం అని తెలిపారు.ఇందు లో చిత్రం అంతా లుంగీ కట్టి నటిం చానన్నారు. దర్శకుడు రామనాధ్ స్క్రిప్ట్‌తో పాటు ఒక సీడీని తనకు అందించారన్నారు. ఈ కథకు నాయికగా నయనతార అయితే బాగుం టుందని అనిపించిందని ఆమెను సంప్రదించగా కాల్‌షీట్స్ సర్దుబాటు కాకపోవడంతో చాలా మంది ఇతర నటీమణులను పరిశీలించినా ఎందుకనో నయనతార అయితేనే బాగుం టుందని పించడంతో ఆలస్యం అయినా పర్వాలేదని ఆమెనే ఎంపిక చేశామని తెలిపారు. నయనతార లంగా ఓణీ ధరించి పల్లెటూరి అమ్మాయిగా చాలా చక్కగా నటించారని చెప్పారు. అలా నయనతో  తొమ్మిది సంవత్సరాల తరువాత మళ్లీ నటించానని అన్నారు. రౌడీయిజం వద్దని చెప్పే తిరునాళ్ చిత్రంలో జీవా పాత్ర చాలా ఫ్రెష్‌గా ఉంటుందని దర్శకుడు రామనాథ్ చెప్పారు.