ఆమె పారితోషికంతో చిన్న చిత్రం చేయొచ్చు

18 Feb, 2016 07:37 IST|Sakshi
ఆమె పారితోషికంతో చిన్న చిత్రం చేయొచ్చు

నయనతార పారితోషికం అంతా అని సహ నటీమణులు విస్మయం చెందేంతగా వెలిగిపోతోంది ఆ కేరళ భామ. అదృష్టం అన్న విషయాన్ని పక్కన పెడితే పట్టుదల+నిరంతర కృషి+శ్రమ=విజయం ఒక మనిషి ఎదుగుదలకు సూత్రం ఇదే.నటి నయనతారకు ఇది కరెక్ట్‌గా వర్తిస్తుంది. ఒకానొక టైమ్‌లో నటనకు గుడ్‌బై చెప్పిన ఈ బ్యూటీ తన జీవితంలో జరిగిన అనూహ్య పరిణామాల కారణంగా మళ్లీ నటనను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఆ కారణం ఎమిటన్నది చాలా మందికి తెలిసిందే కాబట్టి అది ఇప్పుడు అప్రస్తుతం. సాధారణంగా సెకెండ్ ఇన్నింగ్స్‌లో పూర్వవైభవాన్ని సాధించడం అన్నది అసాధ్యం కాకపోయినా అంత సులభం మాత్రం కాదు.అయితే ఈ విషయంలో నయనతార సాధించారు. ఇంకా చెప్పాలంటే తొలి ఇన్నింగ్స్ క్రేజ్‌ను అధిగమించారని చెప్పాలి. రెండో ఇన్నింగ్‌లోనూ నంబర్‌వన్ స్థానాన్ని కైవసం చేసుకున్న రేర్ నాయకి నయనతార. వరుస విజయాలే ఆమె క్రేజ్‌కు కారణం అని చెప్పవచ్చు.
 

హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రాలతో పాటు,వర్ధమాన హీరోలతో నటించిన చిత్రాలను తన పాపులారిటీతో సక్సెస్ బాట పట్టించడంతో నయనతార హవా నిర్విఘ్నంగా కొనసాగుతోంది.ఆ క్రేజ్‌ను నయనతార బాగా ఉపయోగించుకుంటున్నారు. పెద్ద మొత్తంలో పారితోషికాన్ని రాబట్టుకుంటున్నారు. ఇప్పటి ఆమె పారితోషకం సహ నటీమణులకు గుండెల్లో గుబులు పుట్టిస్తోందని చెప్పవచ్చు. గత ఏడాది వరకూ కోటి రూపాయలు డిమాండ్ చేసిన ఈ కేరళ కుట్టి తాజాగా ఏకంగా మూడు కోట్లకు పెంచేశారని సమాచారం. దర్శకుడు సర్గుణం తన శిష్యుడు దాస్ రామసామిని దర్శకుడిగా పరిచయం చేస్తూ నిర్మిస్తున్న చిత్రంలో నయనతారనే నాయకి.
 

ఈ లేడీఓరియెంటెడ్ కథా చిత్రంలో నటించడానికి ఆమె అందుకుంటున్న పారితోషికం అక్షరాలా మూడు కోట్లని కోలీవుడ్ వర్గాల సమాచారం. ఇదే నిజమైతే తమిళ చిత్ర పరిశ్రమలోనే కాకుండా దక్షిణాది చిత్ర పరిశ్రమలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్ నయనతారనే అవుతారు. అంతేకాదు ఒక స్థాయి హీరోలకు కూడా ఇంత పారితోషికం పొందడం లేదన్నది నిజం. ఇంకా చెప్పాలంటే ఒక్క నయనతార పారితోషికంతో చిన్న బడ్జెట్ చిత్రం రూపొందించవచ్చు అనే టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది.