ఇంట్లోనే డ్రగ్స్‌ అమ్ముతుందట..

18 May, 2018 07:47 IST|Sakshi

తమిళసినిమా: లేడీ సూపర్‌స్టార్‌ నయనతార స్మగ్లర్‌ అవతారమెత్తారట. ఈ బ్యూటీ నటించిన చిత్రాలకిప్పుడు యమ క్రేజ్‌ ఉన్న విషయం తెలిసిందే. తమిళంతో పాటు తెలుగులోనూ చేతి నిండా అవకాశాలు ఉన్నాయి. మరిన్ని చిత్రాలు ఈ అమ్మడి కోసం వెయిటింగ్‌లో ఉన్నాయి.  స్టార్‌ హీరోల చిత్రాలకు దీటుగా నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రాలకు మార్కెట్‌ ఉంది. ఈ మధ్య అరమ్‌ చిత్రం సాధించిన వసూళ్లే అందుకు సాక్ష్యం. నయనతార అరమ్‌ చిత్రంలో ప్రజల కోసం పోరాడిన కలెక్టర్‌గా ప్రేక్షకులను అలరించారు. అలాంటి ఇమేజ్‌ తెచ్చుకున్న నయనతారను స్మగ్లర్‌గా  చూడగలమా? చూసి తీరాల్సిందే. ఎందుకంటే తన తాజా చిత్రంలో డ్రగ్స్‌ స్మగ్లర్‌గా ఈ అగ్ర నటి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారన్నది తాజా సమాచారం.

నయనతార నటిస్తున్న లేడీ ఓరియంటెడ్‌ కథా చిత్రాల్లో కొలమావు కోకిల ఒకటి. నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్న ఈ చిత్రానికి యువ సంగీత దర్శకుడు అనిరుద్‌ సంగీత భాణీలు కడుతున్నారు. అంతే కాదు ఇందులో  ఒక గెస్ట్‌ పాత్రలో మెరవనున్నారనే ప్రచారం సోషల్‌ మీడియాల్లో వైరల్‌ అవుతోంది. ఇటీవల అనిరుద్‌ ఓ ఇంటర్వ్యూలో పేర్కొంటూ కొలమావు కోకిల చిత్రంలో నయనతార ఇంట్లోనే మాదక ద్రవ్యాలను విక్రయించే యువతిగా నటిస్తున్నట్లు తెలిపారు. అయితే ఆమె అలా డ్రగ్స్‌ స్మగ్లర్‌గా ఎందుకు మారారన్నది చిత్రంలో ఆసక్తికరమైన అంశంగా ఉంటుందని చెప్పారు. ఏదేమైనా కొలమావు కోకిల చిత్రం డార్క్‌ హ్యూమర్‌ కథా చిత్రంగా అందరికీ వినోదాన్ని పంచుతుందని చిత్ర వర్గాలు పేర్కొంటున్నాయి. ఇందులో నయనతారతో పాటు, జాక్యూలైన్, యోగి బాబు, శరణ్య, నిషా ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. ఈ చిత్రం కోసం నటుడు శివకార్తీకేయన్‌ ఒక పాటను రాయడం విశేషం.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా