నయనతార ఇటు ‘సైరా’.. అటు ‘ఐరా’!

9 Oct, 2018 19:51 IST|Sakshi

సాక్షి, తమిళ సినిమా: తెలుగులో మెగాస్టార్‌ చిరంజీవికి జంటగా సైరా చిత్రంలో నటిస్తున్న నయనతార.. తమిళంలో ఐరా చిత్రంలో నటిస్తుండటం విశేషం. దక్షిణాదిలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న ఏకైక కథానాయిక నయనతార. ప్రస్తుతం ఆమె చేతినిండా సినిమాలు ఉన్నాయి. ఆమె ఇటీవల నటించిన మాయ, ఆరం వంటి చిత్రాలు సక్సెస్‌ కావడంతో వుమెన్‌ సెంట్రిక్‌ కథలతో దర్శకనిర్మాతల నయనతార కోసం ​క్యూ కడుతున్నారు. ఆమె తాజా చిత్రాలు కోలమావు కోకిల, ఇమైకా నొడిగళ్‌ కూడా వరుసగా విజయం సాధించడంతో నయనతార క్రేజ్‌ అమాంతం పెరిగిపోయింది.

ఈ నేపథ్యంలో మరోసారి హీరోయిన్‌ ఓరియంటెడ్‌ సినిమాతో తెరపైకి రావడానికి నయనతార సిద్ధం అవుతున్నారు. ఇంతకుముందు అరమ్, గులేభకావళి వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన కేజేఆర్‌ స్టూడియోస్‌ సంస్థ నిర్మాణంలో సర్జిన్‌ దర్శకత్వంలో నయన ‘ఐరా’ చిత్రం చేస్తున్నారు. సర్జిన్‌ ఇంతకుముందు ‘హెచ్చరికై ఇదు మణిదర్‌గళ్‌ నడమాడుం ఇదం’ అనే సక్సెస్‌ఫుల్‌ చిత్రాన్ని తెరకెక్కించారు. తాజా ‘ఐరా’ చిత్రం షూటింగ్‌ దాదాపు పూర్తి చేసుకుంది. దీని ఫస్ట్‌లుక్, టైటిల్‌ను మంగళవారం సాయంత్రం విడుదల చేశారు. ఈ సినిమాలో నయనతార తొలిసారిగా ద్విపాత్రాభినయం చేస్తున్నారని, హర్రర్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో ఆమె పాత్రలు విభిన్నంగా ఉంటాయని దర్శకుడు సర్జిన్‌ తెలిపారు. ఇందులో రెండు పాత్రలు ఒక దానికి, ఒకటి సంబంధం లేకుండా కాంట్రస్ట్‌గా ఉంటాయని చెప్పారు. ఐరా అంటే ఇంద్రుడి వాహనం ఐరావతమని, ఇందులో ఏనుగు లాంటి బలమైన పాత్రలో నయనతార నటించారని చెప్పారు. డిసెంబర్‌లో క్రిస్మస్‌ పండగ సందర్భంగా ఈ సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు