నయనతార పెళ్లి ఎప్పుడంటే..?

14 Feb, 2019 06:41 IST|Sakshi

నటి నయనతార అంటేనే పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తాయి. అందుకే ఆ భామను సంచల నటి అంటారు. అయ్యా చిత్రంతో కోలీవుడ్‌లో అడుగుపెట్టి తాజా చిత్రం ఐరా వరకూ ఈ బ్యూటీ కెరీర్‌లో ఎన్నో మజిలీలు జరిగాయి. నిజ జీవితంలో ప్రేమలో విఫలం అయినా నట జీవితంలో నయనతార పైచెయ్యే సాధించింది. ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలకు కేరాఫ్‌గా మారింది. రెండు సార్లు ప్రేమలో చేదు అనుభవాలను చవి చూడడంతో మూడోసారి ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటోంది. యువ దర్శకుడు విఘ్నేశ్‌శివన్‌తో ప్రేమలో మునిగితేలుతోంది. అంతేకాదు ఈ సంచలన జంట సహజీవనం చేస్తున్నారనే ప్రచారం చాలా కాలంగానే హోరెత్తుతోంది.

అయితే ఈ విషయాన్ని నయనతార గానీ, విఘ్నేశ్‌శివన్‌గానీ బహిరంగంగా ప్రకటించకపోయినా, షూటింగ్‌లకు గ్యాప్‌ దొరికితే చాలు ఈ జంట విదేశాల్లో విహారయాత్రకు పరిగెత్తుతున్నారు. అదీ రహస్యంగా కాదు. అక్కడ వారు కలిసి దిగిన రొమాంటిక్‌ ఫొటోలను సోషల్‌మీడియాలకు విడుదల చేస్తూ ప్రచారం పొందే ప్రయత్నం చేస్తున్నారు. అలాగని నయనతార సినిమా కెరీర్‌ను గాలికొదిలేయడం లేదు. అగ్రనటిగా వెలుగొందుతున్నా, చేతినిండా చిత్రాలతో బిజీగా ఉంది. నయనతార తొలిసారిగా ద్విపాత్రాభినయం చేస్తున్న ఐరా చిత్రం త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. అదే విధంగా శివకార్తికేయన్‌తో రొమాన్స్‌ చేస్తున్న మిస్టర్‌ లోకల్‌ చిత్రం సమ్మర్‌ స్పెషల్‌గా తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. వీటితో పాటు టాలీవుడ్‌ ప్రముఖ కథానాయకుడు చిరంజీవితో నటిస్తున్న సైరా నరసింహారెడ్డి, హీరోయిన్‌ సెంట్రిక్‌ కథాంశంతో రూపొందుతున్న కొలైయుదీర్‌ కాలం చిత్రాల నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. ప్రస్తుతం విజయ్‌కు జంటగా అట్లీ దర్శకత్వంలో నటిస్తోంది. 

పెళ్లి వాయిదాకు..
నటిగా అగ్రస్థానంలో కొనసాగుతూ, నిజ జీవితంలో దర్శకుడు విఘ్నేశ్‌శివన్‌తో రొమాన్స్‌ చేస్తున్నా, పెళ్లి తంతు వాయిదా వేసుకోవడానికి కారణం ఏమిటనే ప్రశ్న చాలా మందిని తొలిసేస్తోందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ అమ్మడి వయసిప్పుడు 34. ఈ ప్రశ్నకు బదులు నయనతార సెంచరీ కొట్టాలట. అర్థం కాలేదా? ఈ బ్యూటీ అన్ని భాషల్లో కలిసి ఇప్పుటికి 60పై చిలుకు చిత్రాలు చేసింది. మరో ఆరేడు చిత్రాలు చేతిలో ఉన్నాయి. నటిగా సెంచరీ కొట్టిన తరువాతనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుందట. అలాగైతే మరో నాలుగైదేళ్లు పెళ్లికి దూరంగా విఘ్నేశ్‌శివన్‌తో సహజీవనం చేస్తూ హాయిగా ఎంజాయ్‌ చేయబోతోందన్న మాట.

ప్రియుడి చిత్రంలో
ప్రేమికుల రోజు సందర్భంగా ఈ సంచలన జంటకు సంబంధించిన తాజా న్యూస్‌ ఏమిటంటే అంతకు ముందు అగ్ర కథానాయకిగా రాణిస్తున్నా, విఘ్నేశ్‌శివన్‌ దర్శకత్వం వహించిన నానుమ్‌ రౌడీదాన్‌ చిత్రంతోనే నయనతార సినీ కెరీర్‌ కొత్త మలుపు తిరిగిందన్నది వాస్తవం. అయితే ఆ తరువాత విఘ్నేశ్‌శివన్‌ నటుడు సూర్య హీరోగా తానా సేర్నద కూటం చిత్రం మాత్రమే చేశాడు. దీంతో నయనతార ప్రేమలో పడి దర్శకత్వాన్ని దూరంగా పెట్టాడనే ప్రచారం ఆయన గురించి జరుగుతోంది. దీంతో నయనతారనే ఆయన్ని నిర్మాతగా మార్చి చిత్రం చేయడానికి సిద్ధమైందని సమాచారం. నయనతారనే సెంట్రిక్‌ పాత్రను పోషించనున్న ఈ చిత్రానికి మిలింద్‌ దర్శకత్వం వహించనున్నారు. ఈయన ఇంతకు ముందు అవళ్‌ అనే చిత్రాన్ని చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నట వర్గం, సాంకేతిక వర్గాన్ని త్వరలోనే వెల్లడించే అవకాశం ఉందని తెలిసింది.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా