ఈ కలయిక ఏ క్రేజ్‌కు చిహ్నం?

17 Nov, 2019 11:32 IST|Sakshi

ఒక క్రేజీ కలయిక అమెరికా వేదికైంది. అది ఒక హిట్‌ చిత్ర కాంబినేషన్‌కు దారి తీయనుందా? ఆ సంగతేంటో చూద్దాం. సంచలన నటి నయనతారను అగ్రనటి అని, లేడీసూపర్‌స్టార్‌ అని పిలుస్తుంటారు. ఇటీవల విజయ్‌తో బిగిల్‌ చిత్రంలో నటించి హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం రజనీకాంత్‌తో జతకట్టిన దర్బార్‌ చిత్ర రిజల్ట్‌ కోసం ఎదురుచూస్తోంది. ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. తాజాగా తన ప్రియుడు, దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ నిర్మాతగా మారి నిర్మిస్తున్న నెట్రికన్‌ చిత్రంలో నటిస్తోంది. ఇది హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ కథా చిత్రం కావడం విశేషం. కాగా ఏ మాత్రం గ్యాప్‌ దొరికినా నయనతార తన ప్రియుడిని తీసుకుని విదేశాల్లో విహరించేస్తుంటుంది. తన పుట్టినరోజు అయినా, తన ప్రియుడి పుట్టినరోజు అయినా ఈ జంట విదేశాలకు చెక్కేస్తారు. 

తాజాగా ఎవరి పుట్టినరోజు వేడుకకాకపోయినా అమెరికాకు వెళ్లి ఎంజాయ్‌ చేస్తున్నారు. అలా అక్కడ బాలీవుడ్‌ నిర్మాత, నటి శ్రీదేవి భర్త బోనీకపూర్‌ను ఈ జంట కలిశారు. అది యాదృచ్చిక కలయికా, లేక ప్లాన్‌ చేసుకున్న మీటింగ్‌నా అన్నది పక్కన పెడితే వీరి కలయికపై సామాజిక మాధ్యమాల్లో చర్చ జరుగుతోంది. వారు కలిసిన ఫొటో వైరల్‌ అవుతోంది. అక్కడ బోనీకపూర్‌తో పాటు ఆయన రెండవ కూతురు ఖుషీకపూర్‌ కూడా ఉంది. కాగా బోనీకపూర్‌ ఇటీవల తన నిర్మాణ సంస్థను కోలీవుడ్‌కు విస్తరించి, అజిత్‌ హీరోగా నేర్కొండ పార్వై చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. అదేవిధంగా అజిత్‌తో మరో చిత్రాన్ని నిర్మించడానికి రెడీ అయ్యారు. నేర్కొండ పార్వై చిత్రం ఫేమ్‌ హెచ్‌.వినోద్‌నే ఈ చిత్రాన్ని  తెరకెక్కించనున్నారు. చిత్ర షూటింగ్‌ డిసెంబరులో మొదలవుతుందనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్స్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. 

కాగా ఈ చిత్రంలో అజిత్‌ పోలీస్‌అధికారిగా నటించనునున్నట్లు సమాచారం. ఆయన ఇంతకుముందు ఎన్నైఅరిందాళ్, ఆంజనేయ, మంగాత్తా చిత్రాల్లో పోలీస్‌అధికారిగా నటించారు. కాగా తాజా చిత్రానికి వలిమై అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇది అజిత్‌కు 60వ చిత్రం అవుతుంది. ఇకపోతే ఇందులో ఆయనకు జంటగా నయనతార నటించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. తాజాగా బోనీకపూర్, నయనతారల అమెరికా కలయిక వలిమై చిత్రంలో భాగమేనా అనే ప్రశ్నకు ఆస్కారం కలిగిస్తోంది. అజిత్, నయనతార ఇంతకుముందు ఏకన్, ఆరంభం, విశ్వాసం చిత్రాల్లో జతకట్టారు. వీటిలో ఆరంభం, విశ్వాసం మంచి విజయాలను అందుకున్నాయి.

దీంతో వలిమై చిత్రంతో ఈ జంట మరోసారి కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. ఏదేమైనా నయనతార తన ప్రియుడు విఘ్నేశ్‌శివన్‌నిర్మాత బోనీకపూర్, ఆయన కూతురు ఖుషీ కపూర్‌లతో కలిసి అమెరికాలో డిన్నర్‌ చేశారన్న వార్త సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు వైరల్‌ అవుతోంది. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు