రెప్పపాటు కాలంలో...!

2 Sep, 2016 00:06 IST|Sakshi

ఇమేజ్ చట్రంలో ఇరుక్కున్న నటీనటులు ప్రయోగాత్మక చిత్రాలు, పాత్రలు చేయడానికి దాదాపు సాహసం చేయరు. కానీ, నయనతార లాంటి కొందరు ఆర్టిస్టులు మాత్రం పాత్రల ఎంపిక విషయంలో తెగువ చూపిస్తారు. ఒకవైపు రొటీన్ కమర్షియల్ సినిమాలు, మరోవైపు లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేస్తున్నారు. అది మాత్రమే కాదు.. కథ నచ్చితే తమిళ నటుడు శివకార్తికేయన్ వంటి అప్‌కమింగ్ హీరోల సరసన నటిస్తున్నారు. అప్‌కమింగ్ డెరైక్టర్స్‌తో కూడా సినిమాలు చేయడానికి వెనకాడడం లేదు.
 
 ఇప్పటికే చేతిలో కథానాయిక ప్రాధాన్యంగా సాగే ‘దొర’ అనే సినిమా ఉంది. ఇప్పుడు మరో సినిమా ఒప్పుకున్నారు. ‘కన్ ఇమైక్క నొడిగళ్’ అనేది ఈ చిత్రం టైటిల్. అంటే.. రెప్పపాటు కాలం అని అర్థం. ‘డీమాంట్ కాలనీ’ అనే చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయమైన ఆర్. అజయ్ జ్ఞానముత్తుకి ఇది రెండో సినిమా. అయినప్పటికీ అతను చెప్పిన కథ నచ్చి, నయన అంగీకరించేశారు. ఈ చిత్రకథ రాసుకున్న తర్వాత నయనతార అయితే బాగుంటుందని అజయ్ అనుకున్నారట. ఒప్పుకుంటారో లేదో అనే సందేహంతోనే కథ చెప్పారట.
 
  కథ విన్నాక ఈ సినిమా టైటిల్‌లా కళ్లు మూసి తెరిచే లోపు ఈ బ్యూటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. ఇప్పటివరకూ చేయని పాత్రను నయనతార ఇందులో చేస్తున్నారని దర్శకుడు పేర్కొన్నారు. కాగా, ఈ చిత్రంలో అథర్వ మురళి హీరోగా నటించనున్నారు. అతని సరసనే నయనతార నాయికగా నటిస్తారనే వార్త ప్రచారంలో ఉంది. అది నిజం కాదనీ, అథర్వ సరసన వేరే నాయికను తీసుకుంటామని దర్శకుడు స్పష్టం చేశారు.