సంఘమిత్ర నాయకి నయనేనా?

12 Jun, 2017 03:23 IST|Sakshi
సంఘమిత్ర నాయకి నయనేనా?

ప్రారంభానికి ముందే పలు సంఘటనలతో మీడియాలో హెడ్‌లైన్స్‌తో విశేష ప్రచారాన్ని పొందుతున్న చిత్రం సంఘమిత్ర. బాహుబలి చిత్రం తరహాలో చారిత్రక కథాంశంతో అత్యంత భారీ బడ్జెట్‌లో తెరకెక్కించడానికి శ్రీతేనాండాళ్‌ ఫిలింస్‌ సంస్థ సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆస్కార్‌ అవార్డు గ్రహీత ఏఆర్‌.రెహ్మాన్‌ సంగీత బాణీలు కడుతున్నారు. సుందర్‌.సీ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో తారాగణం కోసం చాలా కాలంగా చర్చలు జరుగుతున్నాయి. మొదట్లో విజయ్, టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు పేర్లు వినిపించాయి. ఆ తరువాత అజిత్‌ పేరు ప్రచారంలో నానింది.

చివరికి జయంరవి, ఆర్య ఎంపికయ్యారు. ఇక హీరోయిన్‌ విషయంలోనే చాలా తర్జన భర్జనలు జరిగాయి. పలువురు ప్రముఖ నటీమణుల పేర్లు పరిశీలనలో ఉన్నా తుదికి క్రేజీ నటి శ్రుతీహాసన్‌ను ఎంపిక చేశారు. ఇందుకోసం ఆ బ్యూటీ కత్తిసాములో కూడా శిక్షణ పొందారు. కాన్స్‌ చిత్రోత్సవాల్లోనూ చిత్ర యూనిట్‌తో కలిసి శ్రుతీహాసన్‌ సందడి చేశారు. ఇక చిత్రం సెట్‌కు వెళ్లడమే తరువాయి అనుకున్న తరుణంలో శ్రుతీ చిత్రం నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించి సంచలనానికి కేంద్రబిందువు అయ్యారు.

ఈ సంఘటన గురించి ఇప్పటికీ రకరకాల ప్రచారం హల్‌చల్‌ చేస్తూనే ఉన్నాయి. కాగా ఇలాంటి పరిస్థితిలో తాజాగా నేటి అగ్రనాయకి నయనతార సంఘమిత్రలో యువరాణిగా మారే అవకాశం ఉన్నట్లు వార్తలు వెలువడుతుండడం విశేషం. నయనతారను సంఘమిత్ర చిత్రంలో నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఈ బ్యూటీ కనుక గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తే సంఘమిత్ర చిత్రం రేంజ్‌ పలు రెట్లు పెరగడం ఖాయం అంటున్నారు సినీ వర్గాలు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
సినిమా