విఘ్నేశ్‌తో నయన్‌ తెగతెంపులు?

6 Jan, 2020 08:44 IST|Sakshi

సినిమా: నయనతార మళ్లీ ఒంటరైందా? ఈ ప్రశ్నకు అవుననే ప్రచారమే జరుగుతోంది. మొదటి నుంచి సంచలన నటిగానే ముద్ర వేసుకున్న నయనతార ఇప్పటికీ దాన్ని తన పేటెంట్‌గా మార్చుకుంది. నటిగా తన స్థాయిని పెంచుకుంటూ నంబర్‌ఒన్‌ కథానాయకిగా వెలిగిపోతోంది. అయితే వ్యక్తిగతంగా మాత్రం, ముఖ్యంగా ప్రేమ విషయంలో మోసపోతూనే ఉందని చెప్పవచ్చు. మొదట్లో నటుడు శింబుతో ప్రేమలో పడ్డ ఈ అమ్మడు ఆ తరువాత అది బెడిసి కొట్టడంతో చాలా మానసిక వేదనకు గురైంది. దాని నుంచి కోలుకుని నటనపై దృష్టి పెట్టిన నయనతార మరోసారి నటుడు ప్రభుదేవా ప్రేమలో పడింది. ఆ ప్రేమ పెళ్లి అంచుల వరకూ తీసుకెళ్లింది. అయితే పెళ్లి పీటలు మాత్రం ఎక్కించలేకపోయింది. ప్రభుదేవాతో పెళ్లి కోసం నట జీవితాన్నే త్యాగం చేయడానికి సిద్ధమైంది. అంతే కాదు మతం కూడా మారిందనే ప్రచారం హోరెత్తింది. అయినా ఫలితం లేకపోయింది. దీంతో మళ్లీ నటననే నమ్ముకుంది. అగ్రనటి స్థాయికి ఎదిగింది. అలాంటి సమయంలో నానుమ్‌ రౌడీదాన్‌ చిత్ర షూటింగ్‌ సమయంలో ఆ చిత్ర దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌తో పరిచయం ప్రేమగా మారింది. అంతే ఆ యువ దర్శకుడితో సహజీవనం చేస్తూ వస్తోంది.

వీరిద్దరూ బహిరంగంగానే కలిసి చట్టాపట్టాలేసుకుని తిరిగేస్తున్నారు. ఇద్దరిలో ఎవరి పుట్టిన రోజు వచ్చినా, విదేశాలకు చెక్కేసి ఎంజాయ్‌ చేస్తున్నారు. అక్కడ వారు తీసుకున్న ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేస్తూ వార్తల్లోకెక్కుతున్నారు. ఇలా సామాజిక మాధ్యమాలకు చేతి నిండా పని చెబుతూ వస్తున్నారు. క్రిస్మస్, న్యూ ఇయర్‌ ఇలా ఎలాంటి వేడుక వచ్చినా విదేశాల్లో విహరించేస్తున్నారు. గత క్రిస్మస్‌ పండగకు కూడా యూఎస్‌కు వెళ్లారు. అదే విధంగా 2020 నూతన సంవత్సరం కూడా విదేశాల్లో గడుపుకోవడానికి వెళ్లారు. అయితే అక్కడ నయనతార తాను సింగిల్‌గా తీసుకున్న ఫొటోలనే సామాజిక మాధ్యమాలకు విడుదల చేసి అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. అప్పుడు దీని గురించి పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు గానీ, తాజా పరిణామాలతో నయనతార మూడో ప్రేమ కథ కూడా కంచికి చేరిందనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ విదేశీ పయనంలో నయనతారకు దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌కు మధ్య మనస్పర్థలు తలెత్తాయని, అందుకు కారణం విఘ్నేశ్‌ శివన్‌ పెళ్లి ప్రస్తావన తీసుకురావడమేనని ప్రచారం. నిజానికి వీరిద్దరి మధ్య పెళ్లి గొడవ చాలా కాలంగానే నానుతోంది.

విఘ్నేశ్‌ శివన్‌ ఇంట్లో ఆయనపై పెళ్లి ఒత్తిడి పెరుగుతోందనే ప్రచారం జరిగింది. కాగా నయనతార మరి కొద్ది కాలం పెళ్లిని దూరంగా పెడదామని చెప్పడంతో విఘ్నేశ్‌ శివన్‌ మౌనం వహించారని సమాచారం. ఏదేమైనా నయనతార, విఘ్నేశ్‌శివన్‌ ఇటీవల కాలంలో పలు దేవాలయాలకు వెళ్లి విశేష పూజలు నిర్వహించారు. దోష పరిహార పూజలు చేయడంతో పెళ్లి కోసమే ఈ దైవానుగ్రహ పూజలు అని అందరూ అనుకున్నారు. కాగా తాజాగా విఘ్నేశ్‌ శివన్‌ మరోసారి నయనతారపై పెళ్లి ఒత్తిడి చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం నంబర్‌వన్‌ స్థానంలో కొనసాగుతున్న నయనతార పెళ్లి చేసుకుంటే ఆ స్థానాన్ని కోల్పోవాల్సి వస్తుందనే భయమే లేక పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన లేకనో విఘ్నేశ్‌శివన్‌తో పెళ్లికి అయిష్టతను వ్యక్తం చేసినట్లు సమాచారం. అంతే కాదు తనతో కలిసి తిరుగుతూ నీలోని ప్రతిభకు పదును పెట్టకుండా అవకాశాలను కోల్పోకు అని సలహా కూడా ఇచ్చినట్లు సమాచారం. దీంతో కోపగించుకున్న విఘ్నేశ్‌శివన్‌ వెంటనే పెట్టె బేడా సర్దుకుని విదేశం నుంచి తిరిగొచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. నటిగా నంబర్‌వన్‌ స్థానాన్ని కోల్పోవడం ఇష్టం లేకే నయనతార విఘ్నేశ్‌ శివన్‌ను వదిలించుకున్నట్లు టాక్‌. ఇందులో నిజమెంతో? అబద్ధమెంతో తెలియదు గానీ, శనివారం చెన్నైలో జరిగిన ఒక అవార్డు వేడుకకు నయనతార ఒంటరిగానే విచ్చేసింది. సాధారణంగా ఎలాంటి కార్యక్రమాలలోనూ పాల్గొనని నయనతార ఈ వేడుకకు రావడం కూడా చర్చనీయాంశంగా మారింది. కాగా విఘ్నేశ్‌ శివన్‌తో తెగతెంపులు అన్న సామాజిక మాధ్యమాల్లో ప్రచారంపై నయనతార ఎలా స్పందిస్తుందో చూడాలి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా