అప్పుడే హిందీలోతీయాలనుకున్నా: నీలకంఠ

15 Oct, 2014 23:06 IST|Sakshi
అప్పుడే హిందీలోతీయాలనుకున్నా: నీలకంఠ

 ‘‘నా అభిమాన దర్శకుల్లో మహేష్ భట్ ఒకరు. ఆయన ‘మాయ’ చిత్రం చూసి, హిందీలో నిర్మించాలనుకుంటున్నాననడంతో పాటు నన్నే డెరైక్షన్ చేయమన్నారు. వాస్తవానికి ‘మాయ’ పాయింట్ అనుకున్నప్పుడే తెలుగు, హిందీ భాషల్లో చేయాలనుకున్నాను. కానీ, బడ్జెట్‌ని దృష్టిలో పెట్టుకుని విరమించుకున్నాను. ఇప్పుడు హిందీలో చేసే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది’’ అని దర్శకుడు నీలకంఠ చెప్పారు. ప్రముఖ బాలీవుడ్ దర్శక, నిర్మాతలు మహేష్ భట్, విక్రమ్ భట్ ‘మాయ’ చిత్రాన్ని హిందీలో ‘మర్డర్ 4’గా పునర్నిర్మించనున్నారు.
 
  ఈ చిత్రవిశేషాలు తెలియజేయడానికి ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ‘మధుర’ శ్రీధర్ మాట్లాడుతూ -‘‘జోష్ మీడియా ప్రతినిధులు వీరేన్, వందనలకు మహేష్ భట్‌గారితో మంచి అనుబంధం ఉంది. వాళ్ల ద్వారానే ‘మాయ’ చిత్రం మహేష్‌భట్ దృష్టికెళ్లింది. తెలుగువారికి నచ్చిన ఈ చిత్రం బాలీవుడ్ స్థాయికి వెళ్లడం ఆనందంగా ఉంది’’ అన్నారు. ఈ ఏడాది బాలీవుడ్‌లో బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా ‘మర్డర్ 4’ నిలుస్తుందనే నమ్మకాన్ని వీరేన్ వెలిబుచ్చారు. ఈ చిత్రంతో దర్శకుడిగా నీలకంఠ బాలీవుడ్‌లో స్థిరపడతారని నిర్మాత లగడపాటి శ్రీధర్ ఆశాభావం వ్యక్తం చేశారు.