సినిమా చూసినవారంతా అలా అయిపోతారా?

29 Jun, 2019 08:33 IST|Sakshi

‘అర్జున్‌రెడ్డి’ హిందీ రీమేక్‌ ‘కబీర్‌ సింగ్‌’పై చాలా విమర్శలు వస్తున్నాయి. ‘తెలుగు వెర్షనే ఘాటు అనుకుంటే, అంతకుమించిన మొరటుతనంతో హిందీ వెర్షన్‌ ఉంది. హీరోహీరోయిన్‌ల సీన్‌లు, హీరో బిహేవియర్‌ విపరీతంగా ఉన్నాయి’’ అని అందరి నోటా ఒకటే రివ్యూ! కరెన్సీ నోట్‌ల రివ్యూలు మాత్రం వేరేగా ఉన్నాయి. రిలీజ్‌ అవగానే ఇరవై కోట్లు.. ముప్పై కోట్లు.. ఇలా వేగంగా వందకోట్లకు వసూళ్లు దాటాయి. డబ్బొస్తే హిట్‌ కొట్టినట్లే కానీ, విలువల్ని కాలరాసే సినిమా నైతికంగా బోల్తాపడినట్లే కదా అనే వాదనకు ఎక్కడా పట్టు దొరకడం లేదు. ‘చూపును బట్టి విలువ ఉంటుంది. విలువల్ని క్యాచ్‌ చెయ్యగలిగితే ఎంత చెత్త సినిమాలోనైనా, ఎంత బండ సన్నివేశంలోనైనా ఒక చక్కటి విలువ కనిపిస్తుంది’.. అని తెలుగు, హిందీ వెర్షన్‌లకు దర్శకుడు ఒకరే అయిన సందీప్‌రెడ్డిని అభిమానించేవారు మాటకు మాట అంటున్నారు.

‘కబీర్‌ సింగ్‌’పై ప్రధానంగా ఉన్న విమర్శ ‘మిసాజినిస్ట్‌’గా ఉందని. అంటే స్త్రీని తక్కువ చేసి తీసిపడేసినట్లుగా! ఈ సినిమాను చూస్తే.. స్త్రీకి సొంత ఆలోచన ఉండదని, మగవాడు ఎంత చెబితే అంత అని; స్త్రీకి వ్యక్తిత్వం ఉండదనీ, మగవాడు ఏం చేసినా తలూపుతుందని; స్త్రీకి స్వాభిమానం ఉండదని, మగవాడు ఛీకొట్టినా అతడి కాళ్ల దగ్గరే పడి ఉంటుందనీ.. స్త్రీలోని ఈ ‘లేకపోవడాన్ని’ దర్శకుడు.. స్త్రీలో ప్రేమ ‘ఉండడం’గా చూపించడం కూడా ఒక మిసాజినిస్టిక్‌ పోకడేనని స్త్రీలు, కొందరు పురుషులు విమర్శిస్తున్నారు. షాహిద్‌ కపూర్‌ని కూడా.. ‘అతడు ఇలాంటి క్యారెక్టర్‌ చేయడం ఏంటి?’ అని అభిశంసిస్తున్నారు. ‘‘ఆ పాత్రను ఒప్పుకునే ముందు తన తల్లితో కూడా అతడు ఒక మాట చెప్పి ఉండవలసింది. ఆమెకు కనుక చెప్పి ఉంటే ఆ పాత్రన వెయ్యొద్దనే ఆమె తన కొడుక్కి చెప్పి ఉండేవారు’’ అని కొందరు అంటున్నారు. అయితే కబీర్‌ సింగ్‌ తల్లి నీలిమా అజీమ్‌ తన కొడుకేనే సమర్థిస్తున్నారు. ‘వాడు నాకు చెప్పినా చెప్పక పోయినా.. ఒక పాత్రను పోషించడానికి.. అది ఎలాంటిదైనా.. నేను అభ్యంతరం ఎలా చెప్పగలను? కళాకారుడు పాత్రకు న్యాయం చేయాలని చూస్తాడే గానీ, ఆ పాత్రను సమాజం ఎలా చూస్తుందని ఆలోచించడు కదా’ అని అన్నారు. అంతేకాదు, ‘‘హాలీవుడ్‌లో ఇలాంటి పాత్రలు వేసిన వాళ్లు ఆస్కార్‌ గెలుచుకున్న సందర్భాలు ఎన్ని లేవు?! ఇక సమాజంపై పాత్ర ప్రభావం అంటారా.. రేపొక సైకోపతిక్‌ సీరియల్‌ కిల్లర్‌ సినిమా వస్తుంది. ఆ సినిమా చూసినవారంతా కిల్లర్‌లు అయిపోతారా?’’ అని నీలిమా అజీమ్‌ కూడా ఘాటుగా ప్రశ్నిస్తున్నారు. 

>
మరిన్ని వార్తలు