ప్రేమజంట ముచ్చట్లు

16 Jun, 2014 00:14 IST|Sakshi
ప్రేమజంట ముచ్చట్లు

 మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఆ యువకుడు ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తుంటాడు. అనుకోకుండా అతని జీవితంలోకి ఓ యువతి వస్తుంది. ఆమెతో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీస్తుంది. ఈ ప్రేమకథ ఎలాంటి మలుపు తీసుకుంటుంది? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘నేను నా ప్రేమకథ’. దత్తాత్రేయ ఎంటర్‌టైన్‌మెంట్స్, శాస్త మీడియాపై వర్మ, పణుకు రమేశ్‌బాబు సంయుక్తంగా నిర్మించారు. వింగ్ కమాండర్ కేఎన్ రావు సమర్పకులు. చిన్ని చరణ్, మిధున్ ఎం.ఎస్. స్వరపరచిన ఈ చిత్రం పాటలను సి. కల్యాణ్ ఆవిష్కరించారు.
 
 వర్మ తనకు మంచి మిత్రుడని, తన తమ్ముణ్ణి హీరోగా చూడాలనే కోరిక అతనికి ఈ చిత్రం ద్వారా నెరవేరిందని, ఈ సినిమా విజయం సాధించాలని సి. కల్యాణ్ ఆకాంక్షించారు. అన్ని పాటలూ బాగా వచ్చాయని చిన్ని చరణ్ తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ - ‘‘మంచి కథ, చక్కని పాటలతో ఈ సినిమా అన్ని వర్గాలవారినీ అలరించే విధంగా ఉంటుంది. ఓ ప్రేమ జంట ముచ్చట్లు, వారి కోపతాపాల సమాహారంతో ఈ కథ నడుస్తుంది’’ అన్నారు. భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలు తీయాలనుకుంటున్నామని కేఎన్ రావు తెలిపారు. శేఖర్, సుష్మా జంటగా నటించిన ఈ చిత్రానికి కెమెరా: నగేష్ ఆచార్య.