ఇకపై రీమేక్స్‌చేయను!

27 Mar, 2017 23:14 IST|Sakshi
ఇకపై రీమేక్స్‌చేయను!

‘‘హీరో ఇమేజ్‌ నుంచి అతణ్ణి మనం బయటకు తీయలేం. హీరోలను ఎంత కొత్తగా చూపించినా వాళ్ల ఇమేజ్‌ ఎక్కడో చోట పని చేస్తుంది. ‘దంగల్‌’లో ఆమిర్‌ ఖాన్, ‘సుల్తాన్‌’లో సల్మాన్‌ ఖాన్‌ ఇమేజ్‌ పని చేసింది కదా! పవన్‌ కల్యాణ్‌గారు అనే కాదు... ఏ కమర్షియల్‌ హీరో అయినా మాస్‌ డైలాగులు చెబుతూ, మీసం తిప్పాలని ప్రేక్షకులు కోరుకుంటారు. కొత్త పాత్రలోకి హీరోని ఎంత బాగా మౌల్డ్‌ చేయగలిగారనేది దర్శకుల ప్రతిభ మీద ఆధారపడి ఉంటుంది’’ అన్నారు దర్శకుడు కిశోర్‌ పార్ధసాని (డాలీ). పవన్‌ కల్యాణ్‌ హీరోగా డాలీ దర్శకత్వంలో శరత్‌ మరార్‌ నిర్మించిన ‘కాటమరాయుడు’ గత శుక్రవారం రిలీజైంది. సోమవారం మీడియా సమావేశంలో డాలీ చెప్పిన విశేషాలు

పవన్‌కల్యాణ్‌గారు గత సినిమాల్లో కంటే... ‘కాటమరాయుడు’లో కొత్తగా కనిపించారని, ఇప్పటివరకూ ఆయన్ని అలాంటి పాత్ర, సన్నివేశాల్లో చూడలేదనీ ప్రేక్షకులు అంటున్నారు. కల్యాణ్‌గారి ఇమేజ్‌కి సినిమా అంతా పంచెకట్టు అంటే భయం వేసింది. కానీ, ఫస్ట్‌ డే షూటింగ్‌లో ఆయన్ను చూడగానే తప్పకుండా వర్కౌట్‌ అవుతుందనుకున్నాం. అందుకే ఓ ఫైట్‌ను పంచెకట్టులో డిజైన్‌ చేశాం.

‘గోపాల గోపాల’ తర్వాత కల్యాణ్‌గారు నాతో సినిమా చేస్తానన్నారు. ఓ కథ రాసి, చెప్పా. ఆ సినిమా డైలాగ్‌ వెర్షన్‌ కంప్లీట్‌ కావడానికి నాలుగైదు నెలలు పడుతుందనగా... ఆయనే పిలిచి ఈ ఛాన్స్‌ ఇచ్చారు. ‘వీరమ్‌’ పాయింట్, కమర్షియల్‌ అంశాలు నచ్చాయి. అమ్మాయిలను ద్వేషించే రాయలసీమ ఫ్యాక్షనిస్ట్‌ లైఫ్‌లోకి ఓ అమ్మాయి వస్తే ఎలా ఉంటుందనే పాయింట్‌ ఆసక్తిగా అనిపించింది. తెలుగులో ఆ ప్రేమకథను ఎక్కువ ఎలివేట్‌ చేశాం. ప్రేక్షకులూ కల్యాణ్‌గారిని అలానే చూడాలనుకుంటున్నారు. కథపై క్లారిటీతో ఉంటే ఏ హీరో అయినా... దర్శకుడికి స్వేచ్ఛ ఇస్తారు. అమితాబ్‌ బచ్చన్, పవన్‌కల్యాణ్‌ ఎవరైనా! ‘గోపాల గోపాల’కు ముందు కల్యాణ్‌గారు మూడీ అనీ, దర్శకుడికి ఫ్రీడమ్‌ ఇవ్వరనీ నేనూ విన్నాను. కానీ, ఆయనతో పని చేయడం నాకు నచ్చింది. చాలా ఫ్రీడమ్‌ ఇచ్చారు. హి ఈజ్‌ వెరీ కూల్‌.

ఫారిన్‌లో తీసిన పాటల్లో శ్రుతీహాసన్‌ కాస్ట్యూమ్స్, లుక్స్‌పై విమర్శలు వస్తున్నాయని ఆయన్ను అడగ్గా ‘‘ఆమె బాగా నటించారు. ముఖ్యంగా రెండు పాటల్లో శ్రుతి కాస్ట్యూమ్స్‌పై మా అభిప్రాయమూ అదే. ముంబయ్‌ డిజైనర్లు వాటిని డిజైన్‌ చేశారు. జాగ్రత్తపడే లోపే పరిస్థితి చేయి దాటింది’’ అన్నారు.

స్ట్రయిట్‌ సినిమా తీసినా... హాలీవుడ్‌ సినిమా లేదా ఎక్కడో చోటనుంచి కొందరు స్ఫూర్తి పొందుతారు. రీమేక్‌ సినిమా కూడా అంతే. మక్కీ టు మక్కీ రీమేక్‌ చేయడం నాకిష్టం లేదు. రీమేక్‌లో కథ తీసుకుని ఫ్రెష్‌ స్క్రిప్ట్‌ చేస్తా. ఈ సినిమాలో ఫస్టాఫ్‌ మాగ్జిమమ్‌ మార్చేశా. ఇప్పటికే మూడు రీమేక్స్‌ చేశా. ఇకపై రీమేక్స్‌ చేయాలనుకోవడం లేదు.

ఈ సినిమాకి జరిగినంత పైరసీ గతంలో ఏ సినిమాకీ జరగలేదనుకుంట! ఫేస్‌బుక్‌ చూస్తే దారుణంగా సినిమాలో అన్ని క్లిప్స్‌ పోస్ట్‌ చేశారు. మన దేశంలో మేజర్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సినిమానే. అలాంటి ఎంటర్‌టైన్‌మెంట్‌ను దయచేసి చంపకండి. సోషల్‌ మీడియాలో సీన్స్‌ చూడడం వల్ల సినిమా చూసేటప్పుడు అందులోని బ్యూటీ మాయమవుతుంది. సైబర్‌ క్రైమ్‌లో పైరసీపై మేం కంప్లైంట్‌ చేశాం. పైరసీ చేసినోళ్లపై తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.