కోలీవుడ్ లో కొత్త హీరోయిన్ల జోరు

14 Jul, 2013 16:07 IST|Sakshi
ఆరుషి, తులసి, నజ్రియా

తమిళ సినిమాల్లో కొత్త హీరోయిన్ల సంఖ్య ప్రతి ఏడాదీ పెరుగుతోంది. ఒకప్పుడు హీరోయిన్ కోసం దర్శక నిర్మాతలు కళాశాలలు, బస్టాప్‌ల చుట్టూ తిరిగేవారు. ఇప్పుడు కాలం మారింది.

నేటి తరం అమ్మాయిల్లో స్వతంత్ర భావాలు పెరిగాయి. వారి గమ్యాన్ని వారే ఎంచుకుంటున్నారు. సినిమా రంగం అంటే ఒకప్పుడు భయపడిన వారు ఇప్పుడు ప్రేమిస్తున్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం పెరుగుతోంది.
 
చిత్ర నిర్మాణాల సంఖ్య అధికమే
కోలీవుడ్‌లో నానాటికీ చిత్ర నిర్మాణాల సంఖ్య పెరుగుతోంది. అదే విధంగా హీరోయిన్ల సంఖ్య అధికమవుతోంది. గత ఏడాది 65 మంది కొత్త హీరోయిన్లు పరిచయమయ్యారు. అలాగే 2013లో జూన్ నాటికే 50 మంది హీరోయిన్లు తెరంగేట్రం చేశారు. దీన్ని బట్టి చూస్తే ఈ ఏడాది హీరోయిన్ల సంఖ్య శతకం చేరుకుంటుందని అంచనా. అదే విధంగా ఈ ఆరు నెలల్లోనే 84 చిత్రాలు తెరపైకి రావడం మరో విశేషం. వీటిలో విజయాలు 15 శాతానికి మించి లేవు.

కొత్త హీరోయిన్ల పరిస్థితీ అలాగే ఉంది. తక్కువ మందికి మినహా మిగిలిన వారికి రెండవ చిత్రంలో నటించే అవకాశం దక్కలేదు. ఈ ఏడాది పరిచయమైన ముఖ్యమైన వాళ్లలో రాధ రెండవ కుమార్తె తులసి ఒకరు. ఈమె మణిరత్నం కడల్ చిత్రం ద్వారా తెరపైకొచ్చింది. ఆ చిత్రం ఆశించిన విజయం సాధించకపోయినా తులసికి బాగానే ప్రచారం లభించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ జీవా సరసన యాన్ అనే చిత్రంలో నటిస్తోంది.

మరో నటి నజ్రియా నసీమ్. ఈమె తొలి చిత్రం నేరంతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేరళ నుంచి దిగుమతి అయిన ఈ లక్కీగర్ల్ ఇప్పుడు మూడు, నాలుగు చిత్రాలతో బిజీగా ఉంది. ఆదిలోనే ధనుష్ వంటి స్టార్ హీరో సరసన నటించే అవకాశం దక్కించుకుంది. అదే విధంగా అళగన అళగి చిత్రం ద్వారా పరిచయమైన ఆరుషి నటన పలువురిని అలరించింది. ప్రస్తుతం ఈమె అడిత్తనం తదితర చిత్రాలలో నటిస్తోంది.

మదిల్‌మేల్ పూనై ద్వారా తెరంగేట్రం చేసిన విభ ప్రస్తుతం సుమ్మా నచ్చన్ను ఇరుక్కు తదితర చిత్రాలతో బిజీగా ఉంది. కోలీవుడ్‌లో అడుగు పెట్టిన ముంబై భామలు ఇషా శర్వాణి, మోనాల్ గజ్జర్, అశ్వితశెట్టి, డింపుల్, సుర్విన్, ఇషా తల్వార్ తదితరులు తగిన గుర్తింపు పొందారు. మిగిలిన వారు సినిమాల్లో నిలదొక్కుకోగలరా! లేక తిరిగి టపా కడతారా! అన్నది వేచి చూడాల్సిందే.

>