కొత్త లుక్కు... అదిరిపోయే కిక్కు 

2 Jan, 2020 01:24 IST|Sakshi

కొత్త ఏడాది వచ్చింది. వస్తూ వస్తూ సినిమాల కొత్త పోస్టర్లను, కొత్త చిత్రాల ప్రకటనలను మోసుకొచ్చింది. తెలుగు సినిమాకు కొత్త శోభను అలంకరించి ప్రేక్షకులకు అదిరిపోయే కిక్కు ఇచ్చింది. రజనీకాంత్‌ ‘దర్బార్‌’ ఈ నెల 9న విడుదల కానుంది. ఈ చిత్రానికి ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకడు. ఆర్మీమేజర్‌ అజయ్‌ కృష్ణగా మహేశ్‌బాబు నటించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. అనిల్‌రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది.  హీరో అల్లుఅర్జున్, దర్శకుడు త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రూపొందిన తాజా చిత్రం ‘అల..వైకుంఠపురములో..’ ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకురానుంది. రవితేజ నటిస్తున్న ‘డిస్కోరాజా, క్రాక్‌’ చిత్రాల కొత్త లుక్స్‌ విడుదలయ్యాయి. వీఐ ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్న ‘డిస్కోరాజా’ చిత్రం ఈనెల 24న విడుదల కానుంది. గోపీచంద్‌ మలినేని తెరకెక్కిస్తోన్న ‘క్రాక్‌’ వేసవిలో విడుదల అవుతుంది. ఈ నెల 15న ‘ఎంత మంచివాడవురా’ విడుదల కానుంది. సతీష్‌ వేగేశ్న దర్శకత్వంలో కల్యాణ్‌రామ్‌ హీరోగా నటించిన చిత్రం ఇది.

హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వం వహించిన ‘నిశ్శబ్దం’ చిత్రం ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. అదేరోజు  ‘అశ్వథ్థామ’గా వస్తున్నారు నాగశౌర్య. రమణతేజ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. నితిన్‌ను ‘భీష్మ’గా మార్చారు దర్శకుడు వెంకీ కుడుముల. ఫిబ్రవరిలో ‘భీష్మ’ విడుదల కానుంది. పులివాసు దర్శకత్వంలో కల్యాణ్‌ దేవ్‌ నటిస్తున్న ‘సూపర్‌మచ్చి’ పోస్టర్‌ని విడుదల చేశారు. అజయ్‌ కథుర్వర్, డింపుల్‌ జంటగా వేణు ముల్కల దర్శకత్వంలో తెరకెక్కించిన ‘విశ్వక్‌’ చిత్రం షూటింగ్‌ పూర్తయింది. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. శైలేష్‌ కొలను దర్శకత్వంలో విశ్వక్‌ సేన్‌ హీరోగా నటిస్తున్న ‘హిట్‌’ మూవీ ఫస్ట్‌ గ్లిమ్స్‌ని విడుదల చేశారు. ఫిబ్రవరి 28న సినిమా విడుదలకానుంది.

నిర్మాత రాజ్‌కందుకూరి తనయుడు శివ కందుకూరి హీరోగా నటించిన ‘చూసీ చూడంగానే..’ సినిమాను ఈ నెల 31న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. రవిబాబు దర్శకత్వంలో రూపొందనున్న చిత్రానికి ‘క్రష్‌’ అనే టైటిల్‌ ఖరారు చేశారు.రూపేష్‌ కుమార్‌ చౌదరి, సలోని మిశ్రా జంటగా బి. శశికుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘22’ మూవీ టైటిల్‌ యానిమేషన్‌ లోగోని న్యూ ఇయర్‌ సందర్భంగా విడుదల చేశారు. ఇంకా ‘నా పేరు రాజా: ఈడోరకం’, ‘ఏమైపోయావే’, ‘ఒక చిన్న విరామం’, ‘అనుభవించు రాజా’ వంటి సినిమాల ప్రకటనలు, వీటికి సంబంధించిన ఫస్ట్‌లుక్, కొత్త లుక్‌లు కూడా ప్రేక్షకులకు కనువిందు చేశాయి.

ఓసారి కోలీవుడ్‌ కాలింగ్‌ బెల్‌ కొడితే.. సూర్య హీరోగా ‘గురు’ ఫేమ్‌ సుధాకొంగర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శూరారై పొట్రు’ (తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’!) సెకండ్‌లుక్‌ను విడుదల చేశారు. కార్తీ ‘ఖైదీ’ ఫేమ్‌ లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో విజయ్‌ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రానికి ‘మాస్టర్‌’ అనే టైటిల్‌ ఖరారు చేశారు.  

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు