అలా దర్శకుడినయ్యా!

17 Oct, 2018 00:23 IST|Sakshi

‘‘188 సినిమాలకు రచయితగా పనిచేశాను. 1600 పాటలు రాశాను. గురుచరణ్‌గారు నాకు అన్నయ్యలాంటివారు. కుబేర ప్రసాద్‌గారితో కలసి ఓ సినిమా చేయబోతున్నాం. కథ, స్క్రీన్‌ప్లే రాయమన్నారు. తీరా రాసాక ‘నువ్వే దర్శకత్వం వహించాలి’ అన్నారు. అలా నేను ఈ సినిమాకు దర్శకుడినయ్యా’’ అని భారతీబాబు పెనుపాత్రుని అన్నారు. మహిధర్, శ్రావ్యారావు జంటగా నటించిన చిత్రం ‘నటన’. భవిరి శెట్టి వీరాంజనేయులు, రాజ్యలక్ష్మి సమర్పణలో గురుచరణ్‌ నిర్మాణ సారథ్యంలో కుబేర ప్రసాద్‌ ఈ చిత్రం నిర్మించారు.

ఈ సినిమా టీజర్‌ను తెలంగాణ ఎఫ్‌.డి.సి.చైర్మన్‌ పి.రామ్మోహన్‌ రావు రిలీజ్‌ చేశారు. టైటిల్‌ సాంగ్‌ మేల్‌ వెర్షన్‌ను రచయిత జేకే భారవి, ఫిమేల్‌ వెర్షన్‌ను చాంద్‌ మాస్టర్‌ విడుదల చేయగా, ప్రొడక్షన్‌ లోగోను మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎం.ఎం.శ్రీలేఖ ఆవిష్కరించారు. భారతీబాబు పెనుపాత్రుని మాట్లాడుతూ– ‘‘నటీనటులు, సాంకేతిక నిపుణుల సహాయం లేకుంటే సినిమా ఇంత బాగా వచ్చేది కాదు. సినిమాలో మూడు పాటలు ఉండగా మరో పాట పెట్టాలనిపించింది. శ్రీలేఖగారిని ఈ పాటకు సంగీతం చేయమని కోరగా, పదినిముషాల్లో చేసి ఇచ్చారు. ఈ నెలలో పూర్తి ఆడియో రిలీజ్‌ చేస్తాం’’ అన్నారు. ‘‘నాకు అవకాశం ఇచ్చిన కుబేర ప్రసాద్, భారతీబాబు గార్లకు థ్యాంక్స్‌’’ అన్నారు మహిధర్‌. 

మరిన్ని వార్తలు