నెల్లూరు టు ఖమ్మం

31 Jan, 2018 01:09 IST|Sakshi
సతీష్‌ రెడ్డి, మౌర్యాని

సతీష్‌ రెడ్డి, మౌర్యాని, ముంతాజ్‌ ముఖ్య తారలుగా వీజే రెడ్డి దర్శకత్వంలో సిద్ధి విఘ్నేశ్వరా క్రియేషన్స్‌ పతాకంపై సీహెచ్‌ రఘునాథరెడ్డి నిర్మించిన చిత్రం ‘నెల్లూరి పెద్దారెడ్డి’. గురురాజ్‌ సంగీతం అందించిన ఈ సినిమా పాటలను సీనియర్‌ దర్శకులు సాగర్, రేలంగి నరసింహారావు విడుదల చేశారు. సాగర్‌ మాట్లాడుతూ– ‘‘మంచి సినిమా చేయడానికి కొంత సమయం తీసుకున్నా పర్లేదు కానీ ఏదో ఒకటి చేయాలనుకోకూడదు. ‘నెల్లూరి పెద్దారెడ్డి’ చిత్రాన్ని దర్శకుడు వీజే రెడ్డి పకడ్బందీగా రూపొందించారని తెలిసింది’’ అన్నారు.

‘‘ఈ చిత్రాన్ని నెల రోజుల్లోనే కంప్లీట్‌ చేయడం గొప్ప విషయం. కథను ఎంత బాగా చెప్పామన్నదే ప్రేక్షకులకు ముఖ్యం’’ అన్నారు రేలంగి నరసింహారావు. ‘‘నెల్లూరి నుంచి ఖమ్మం జిల్లా సీతాపురం గ్రామానికి వలస వెళ్లిన పెద్దారెడ్డి అనే వ్యక్తి కథ ఇది. తోటివారికి సాయం చేయాలనుకునే పెద్దారెడ్డి ఓ యువతి కుటుంబానికి ఆశ్రయం ఇవ్వడం వల్ల కథ ఎలాంటి మలుపులు తిరిగిందనేది ఆసక్తికరం. గురురాజ్‌ సంగీతం, డాక్టర్‌ కమలాకర కామేశ్వరరావు సాహిత్యం చక్కగా కుదిరాయి. ఈ సినిమాను ఫిబ్రవరిలో విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు వీజేరెడ్డి. ‘‘సినిమాలో నెల్లూరి పెద్దారెడ్డి ప్రేక్షకులకు మర్చిపోలేని అనుభూతులను అందిస్తాడు’’ అన్నారు సతీష్‌ రెడ్డి. 

మరిన్ని వార్తలు