సినిమా బాగా నచ్చిందట: నిఖిల్

19 Oct, 2016 10:42 IST|Sakshi
సినిమా బాగా నచ్చిందట: నిఖిల్

బెంగళూరు: కన్నడ సినీ చరిత్రలోనే అత్యంత భారీ వ్యయంతో నిర్మించిన జాగ్వార్‌ చిత్రంతో కన్నడ, తెలుగు భాషల్లో ఒకేసారి అడుగుపెట్టిన మాజీ ముఖ్యమంత్రి కుమారుడు నిఖిల్‌గౌడ తన మొదటి చిత్రంతోనే కన్నడనాట భారీ అభిమానగణాన్ని సొంతం చేసుకున్నాడు. జాగ్వార్‌ చిత్రంతో ఘనవిజయం సాధించడంతో చిత్రం ప్రచారంతో పాటు అభిమానులను కలుసుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న అతడు మంగళవారం తన మనసులోని భావాలను  మీడియాతో పంచుకున్నాడు. మొదటి చిత్రంతోనే కన్నడ ప్రజలు తనను చాలా బాగా ఆదరించారన్నారు.  సినిమా బాగా నచ్చిందని  ఇటీవల ఓ ప్రైవేటు సంస్థలో పని చేసే ఉత్తరాదికి చెందిన ఉద్యోగులు పేర్కొనడం సంతోషాన్నిచ్చిందని తెలిపాడు.

జాగ్వార్‌ సినిమాను ఇంకా బాగా తెరకెక్కించి ఉంటే ప్రేక్షకుల్లోకి మరింత చొచ్చుకెళ్లేదన్నాడు. మొదటి చిత్రంతో చాలా నేర్చుకున్నానని, దొర్లిన తప్పులను రెండవ చిత్రంలో పునరావృతం కాకుండా మరింత శిక్షణ తీసుకోవాలని నిర్ణయించుకున్నానని చెప్పాడు. కన్నడ సినీ ఇండస్ట్రీకి మంచి ప్రతిభావంతులను పరిచయం చేసే ఉద్దేశంతో కొత్త స్టూడియోను నిర్మించనున్నామని, అందులో కంప్యూటర్‌ గ్రాఫిక్స్, అధునాతన డబ్బింగ్‌ టెక్నాలజీ తదితర సాంకేతికత సౌకర్యాలను కల్పించనున్నట్లు నిఖిల్ గౌడ పేర్కొన్నాడు. కాగా అతడు నటించబోయే రెండవ చిత్రానికి రేసుగుర్రం, ఊసరవెల్లి,కిక్‌ తదితర హిట్‌ చిత్రాలకు దర్శకత్వం వహించిన టాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు సురేందరరెడ్డి దర్శకత్వం వహించనున్నారని సమాచారం.