నచ్చితేనే చేస్తా!

30 Mar, 2019 12:31 IST|Sakshi

సినిమా: నచ్చితేనే చేస్తానంటోంది నటి నిక్కీగల్రాణి. డార్లింగ్‌ అంటూ జీవీ.ప్రకాశ్‌కుమార్‌కు జంటగా కోలీవుడ్‌కు పరిచయం అయిన నటి ఈ అమ్మడు. తొలి చిత్రమే హిట్‌ అవడంతో వచ్చిన అవకాశాలన్నీ ఎడా పేడా ఒప్పేసుకుని నటించేసింది. లక్కీగా మంచి విజయాలనే అందుకుంది. అందాలారబోతకు ఎలాంటి అభ్యంతరం చెప్పని నటిగా పేరు తెచ్చుకున్న నిక్కీగల్రాణి ఆ మధ్య నటించిన చిత్రం కలగలప్పు 2. ఆ చిత్రం సక్సెస్‌ అనిపించుకుంది. ఇక ఇటీవల ప్రభుదేవాతో జతకట్టిన చార్లీచాప్లిన్‌–2 చిత్రం కూడా పర్వాలేదనిపించుకుంది.కార్తీ హీరోగా నటించిన దేవ్‌ చిత్రంలో అతిథిగా మెరిసింది. అయినా ఈ అమ్మడికి అవకాశాలు తగ్గాయనే ప్రచారం సినీ వర్గాల్లో వైరల్‌ అవుతోంది. అయితే అంతగా నిక్కీగల్రాణికి అవకాశాలు మరీ అడుగంటలేదు.

ప్రస్తుతం ఈ బ్యూటీ జీవాతో రొమాన్స్‌ చేసిన కీ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అవుతోంది. తాజాగా నటుడు శశికుమార్‌కు జంటగా నటిస్తోంది. ఈ సందర్భంగా నిక్కీగల్రాణి మాట్లాడుతూ తనకు అవకాశాలు తగ్గాయనడం సరికాదని అంది. నిజం చెప్పాలంటే చిత్రాల ఎంపికపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు చెప్పింది. పాత్ర నచ్చితేనే నటించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ఒక కథను విన్నప్పుడు అందులో తాను నటిస్తే ఎలా ఉంటుందని ఒక అభిమానిగా ఆలోచిస్తానని అంది. అలా పాత్ర నచ్చితేనే నటించడానికి సమ్మతిస్తున్నానని చెప్పింది. వైవిద్యభరిత పాత్రల్లో నటించాలన్నది తన ఆశ అని, అందుకే పాత్రల ఎంపికలో ఆచితూచి ఎంపిక చేసుకుంటున్నానని నిక్కీగల్రాణి చెప్పింది.

మరిన్ని వార్తలు