గ్లామర్ అంటే స్కిన్ షో కాదు!

16 Feb, 2016 23:11 IST|Sakshi
గ్లామర్ అంటే స్కిన్ షో కాదు!

- నిక్కీ గల్రానీ
‘‘చాలామంది డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యా అంటుంటారు. నేను కూడా అదే కోవలోకి వస్తాను. ఇంట్లో వాళ్లు నన్ను డాక్టర్‌గా చూడాలని కలలు కన్నారు. నేను మాత్రం చదువు మధ్యలోనే మానేసి ఫ్యాషన్ రంగం వైపు వెళ్లి, సినిమా రంగానికి వచ్చా’’ అన్నారు యువ హీరోయిన్ నిక్కీ గల్రానీ. ‘బుజ్జిగాడు’, ‘సత్యమేవ జయతే’ చిత్రాల్లో నటించిన నాయిక సంజనా గల్రానీ చెల్లెలే నిక్కీ గల్రానీ. సునీల్ సరసన ‘కృష్ణాష్టమి’లో, ఆది పినిశెట్టికి జతగా ‘మలుపు’ చిత్రంలో హీరోయిన్‌గా నటించారామె. ఈ రెండు చిత్రాలూ ఈ శుక్రవారం విడుదల కానున్నాయి. తెలుగులో తన తొలిచిత్రమైన ‘కృష్ణాష్టమి’ విశేషాలు నిక్కీ గల్రానీ మాటల్లోనే...
 
* చదువుతున్నప్పుడు మధ్యలో మానేసి మోడలింగ్‌లోకి వచ్చా. కేవలం 10 నెలల్లో 45 యాడ్స్ చేశా. ‘1983’ అనే మలయాళ చిత్రం ద్వారా సినిమా రంగానికి వచ్చా. మలయాళ, కన్నడ, తమిళ భాషల్లో రెండున్నరేళ్లలో 15 సినిమాలు చేశా.
 
* మలయాళంలో చేస్తున్నప్పుడు నిర్మాత ‘దిల్’ రాజుగారి ఆఫీసు నుంచి ఫోన్ వచ్చింది. కానీ, మలయాళ చిత్రం పూర్తయ్యేవరకు కుదరదని చెప్పా. తరువాత ‘దిల్’రాజుగారు ఫోన్ చేసి, ‘నెల తరువాతే షూటింగ్’ అని చెప్పడంతో ఓకే అనేశా. అలా తెలుగులో ‘కృష్ణాష్టమి’ నా మొదటి చిత్రమైంది.
 
* ఈ చిత్రంలో పల్లవి అనే పాత్ర చేశా. ‘పల్లవిజం’ అనే బుక్ రాస్తుంటా. ప్రతి సమస్యకూ పరిష్కారం ఉందనుకునే తత్త్వం. ప్రతి విషయాన్నీ పాజిటివ్‌గా తీసుకుంటుంది.
 
* కెరీర్‌పరంగా నాకు ఏదైనా అనుమానం వస్తే మా అక్క సంజనను అడిగి, సమాధానం తెలుసుకుంటాను. నాకు అక్క అంటే అమ్మలాగ అన్నమాట!
 
* వర్క్ పట్ల డెడికేషన్ ఉన్న వ్యక్తి హీరో సునీల్. ఆయన వద్ద నుంచి చాలా నేర్చుకున్నా. విదేశాల్లో రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలో వణుకొచ్చే చలిలో కూడా ఆయన ఉదయాన్నే 4 గంటలకు లేచి జాగింగ్‌కు వెళ్లొచ్చేవారు. నేను చాలా సహనంగా ఉంటాను. ఇక, మా డెరైక్టర్ వాసువర్మగారైతే చెప్పనక్కర్లేదు. ఎలాంటి పరిస్థితినైనా చాలా కూల్‌గా హ్యాండిల్ చేస్తారు.
 
* ఏ సినిమా చేసినా నా పాత్రకూ, నా నటనకూ ప్రాధాన్యం ఉండాలి. నా సినిమాలు కుటుంబమంతా కలిసి చూసేలా ఉండాలి. అటువంటి పాత్రలైతేనే ఎంచుకుంటా. నా దృష్టిలో గ్లామర్ అంటే స్కిన్ షో కాదు. అమ్మాయిలను చీరలో కూడా అందంగా చూపొచ్చు. ఈ చిత్రంలో స్కర్ట్స్, జీన్స్ వేసుకున్నా అందంగా ఉంటుంది. ఎక్కడా అసభ్యత ఉండదు.
 
* తమిళంలో మూడు సినిమాలు చేస్తున్నా. తెలుగులో కూడా అవకాశాలొస్తున్నాయి. ఇంకా ఏ చిత్రం ఒప్పుకోలేదు. ‘కృష్ణాష్టమి’ రిలీజ్ తర్వాత ఖరారు చేస్తా.