'నిర్మలా కాన్వెంట్' మూవీ రివ్యూ

16 Sep, 2016 11:16 IST|Sakshi
'నిర్మలా కాన్వెంట్' మూవీ రివ్యూ

టైటిల్ : నిర్మలా కాన్వెంట్
జానర్ : రొమాంటిక్ డ్రామా
తారాగణం : నాగార్జున, రోషన్, శ్రియా శర్మ, ఎల్బీ శ్రీరామ్
సంగీతం : రోషన్ సాలూరి
దర్శకత్వం : జి. నాగ కోటేశ్వరరావు
నిర్మాత : అన్నపూర్ణా స్టూడియోస్, మ్యాట్రిక్స్ టీం వర్క్స్

విలన్, హీరోగా ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కొనసాగుతున్న టాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ను హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన సినిమా నిర్మలా కాన్వెంట్. ఇప్పటికే బాలనటిగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన శ్రియా శర్మ ఈ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఇమేజ్ను పక్కన పెట్టి స్పెషల్ క్యారెక్టర్లకు కూడా రెడీ అయిన కింగ్ నాగార్జున అతిథి పాత్రలో నటించిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుంది..? ఈ సినిమాతో రోషన్ హీరోగా సెటిల్ అవుతాడా..?

కథ :
చదువు, పుస్తకాలు తప్ప మరో ప్రపంచం తెలియని తెలివైన కుర్రాడు శామ్యూల్ (రోషన్). నిర్మలా కాన్వెంట్లో చదువుకునే శామ్యూల్కు ఏ విషయాన్నైనా క్షుణ్ణంగా తెలుసుకోవటం అలవాటు. అదే కాన్వెంట్లో శామ్యూల్తో పాటు చదువుకుంటుంది శాంతి( శ్రియా శర్మ). కాన్వెంట్ అబ్బాయిలందరికీ శాంతి డ్రీమ్ గర్ల్. కానీ శాంతి మాత్రం శామ్యూల్ వెంట పడుతుంటుంది. శామ్యూల్ కూడా శాంతిని ఇష్టపడతాడు. అన్ని ప్రేమ కథలలాగానే వీరి కథకు కూడా పేదరికం అడ్డు వస్తుంది. దానికి తోడు పెద్ద వాళ్ల గొడవలు కూడా ఈ చిన్నారి ప్రేమికులను దూరం చేస్తాయి. శాంతిని ప్రేమించాడన్న కోపంతో వాళ్లనాన్న శామ్యూల్ను కొట్టి వాళ్ల పొలం లాగేసుకుంటాడు. నా అంతా ఆస్తి,  పేరు సంపాదిస్తే.., నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తానని సవాల్ చేస్తాడు. దీంతో డబ్బు, పేరు సంపాదించటం కోసం హైదరాబాద్ శామ్యూల్ వస్తాడు. మరి శామ్యూల్ అనుకున్నట్టుగా డబ్బు, పేరు సంపాదించాడా..? ఈ ప్రేమికులకు నాగార్జునకు సంబందం ఏంటి.? అన్నదే మిగతా కథ.

నటీనటులు :
తొలిసారిగా వెండితెర మీద హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోషన్ ఆకట్టుకున్నాడు. ఎక్కడ ఇది రోషన్ తొలి సినిమా అన్న భావన కలగకుండా అద్భుతంగా నటించాడు. లుక్స్ పరంగా కూడా రోషన్కు మంచి మార్కులు పడ్డాయి. అందంతో అభినయంతో ఆకట్టుకున్నాడు. బాలనటిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఉన్న శ్రియా శర్మ హీరోయిన్గా అలరించింది. క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో ఆకట్టుకుంది. అతిథి పాత్రలో నటించిన నాగార్జున తనదైన నటనతో సినిమాకు హైప్ తీసుకువచ్చాడు. తన ఇమేజ్ను పక్కన పెట్టి గెస్ట్ అపియరెన్స్ ఇచ్చిన కింగ్, సినిమా స్థాయిని పెంచాడు. ఇతర పాత్రల్లో ఎల్బీ శ్రీరామ్, సూర్య, అనితా చౌదరి, ఆదిత్య మీనన్లు తమ పరిది మేరకు మెప్పించారు.

సాంకేతిక నిపుణులు :
స్టార్ వారసులను పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమా కోసం రొటీన్ ప్రేమ కథను ఎంచుకున్న దర్శకుడు జి. నాగ కోటేశ్వరరావు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. సినిమా మీద భారీ హైప్ ఏర్పడినా ఆ స్థాయికి తగ్గ కథా కథనాలను అందించటంలో తడబడ్డాడు. ముఖ్యంగా హీరో క్యారెక్టర్ను తెలివైన కుర్రాడిగా చూపించే సన్నివేశాలు కొన్ని సిల్లీగా అనిపిస్తాయి. కాన్వెంట్ లవ్ స్టోరిగా తెరకెక్కిన ఈ సినిమాలో యూత్ను ఆకట్టుకునే స్థాయిలో కామెడీ లేకపోవటం కూడా నిరాశపరిచింది. ద్వితీయార్థంలో ఎంట్రీ ఇచ్చిన నాగ్ క్యారెక్టర్ ఆకట్టుకుంటుంది. రోషన్ సాలూరి సంగీతం బాగుంది, కొత్త కొత్త భాష పాట విజువల్గా కూడా అలరిస్తుంది. అన్నపూర్ణ స్టూడియోస్, మ్యాట్రిక్స్ టీం వర్క్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్ :
నాగార్జున
రోషన్, శ్రియా శర్మ

మైనస్ పాయింట్స్ :
బలమైన కథ లేకపోవటం
రొటీన్ టేకింగ్

ఓవరాల్గా నిర్మలా కాన్వెంట్, రొటీన్ ప్రేమకథే.