‘భీష్మ’ మూవీ రివ్యూ

21 Feb, 2020 12:32 IST|Sakshi
Rating:  

టైటిల్‌: భీష్మ
టైటిల్‌: రొమాంటిక్‌ అండ్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌
నటీనటులు: నితిన్‌, రష్మిక మందన, అనంత్‌ నాగ్‌, జిష్‌సేన్‌ గుప్త, వెన్నెల కిశోర్‌, రఘుబాబు తదితరులు
దర్శకత్వం: వెంకీ కుడుముల
సంగీతం: మహతి స్వర సాగర్‌
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
బ్యానర్‌: సితార ఎంటర్‌టైన్‌మెంట్‌
నిడివి: 150.45 నిమిషాలు

‘అఆ’ వంటి బ్లాక్‌బ​స్టర్‌ హిట్‌ తర్వాత యంగ్‌ హీరో నితిన్‌ హీరోగా వచ్చిన లై, చల్‌మోహన్‌రంగ, శ్రీనివాస కళ్యాణం చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద తీవ్రంగా నిరాశపరిచాయి. దీంతో గ్యాప్‌ తీసుకున్న నితిన్‌ తన తరువాత సినిమా కోసం ఆచితూచి అడుగేశాడు. ‘ఛలో’తో మంచి క్రేజ్‌ సంపాదించిన వెంకీ కుడుముల చెప్పిన ‘భీష్మ’ స్క్రిప్ట్‌కు నితిన్‌ లాక్‌ అయ్యాడు. రష్మిక మందన హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్‌, సాంగ్స్‌ సోషల్‌ మీడియాలో ఎంత రచ్చ చేశాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పీడీవీ ప్రసాద్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా నితిన్‌ను మళ్లీ హిట్‌ ట్రాక్‌ ఎక్కించిందా? రష్మిక గ్లామర్‌ ఈ చిత్రానికి ఎంతవరకు పనిచేసింది? టీజర్‌, ట్రైలర్‌ రేంజ్‌లో సినిమా ఉందా? అనేది మన సినిమా రివ్యూలో తెలుసుకుందాం.

కథ: 
తాను ఐఏఎస్‌ అని భీష్మ (నితిన్‌) చెప్పుకుంటూ అమ్మాయిల వెంట పడతాడు. పరిచయం అయిన కొద్ది నిమిషాల్లోనే భీష్మకు బైబై చెప్పి వెళ్లి పోతారు. ఎందుకంటే అతడు చెప్పిన ఐఏఎస్‌కు అర్థం కలెక్టర్‌ అని కాదు.. ఐయామ్‌ సింగిల్‌ అని. డిగ్రీ డ్రాపౌట్‌ అయిన భీష్మ సోషల్‌ మీడియాలో మీమ్స్‌ క్రియేట్‌ చేసి పోస్ట్‌ చేస్తూ కాలం వెళ్లదీస్తుంటాడు. అయితే అనుకోకుండా  చైత్ర(రష్మిక)ను తొలి చూపులోనే ఇష్టపడి, వెంటపడతాడు. తొలుత భీష్మను అసహ్యించుకునే చైత్ర తర్వాత జరిగిన కొన్ని సంఘటనల తర్వాత అతడి ప్రేమలో పడుతుంది. అంత సవ్యంగా సాగుతున్న తరుణంలో ఏసీపీ దేవా(సంపత్‌) తన కూతురు చైత్రను భీష్మ ప్రేమిస్తున్నాడని తెలుసుకొని అతడి తలపై గన్‌ ఎక్కుపెడతాడు. 

ఈ సమయంలో భీష్మ తండ్రి ఆనంద్‌ (నరేశ్‌) ఓ సంచలన విషయాన్ని చెబుతాడు. ఎనిమిది వేల కోట్ల రూపాయలకు పైగా టర్నోవర్‌ కలిగిన భీష్మ ఆర్గానిక్‌ ఫుడ్‌ కంపెనీకి భీష్మ సీఈఓ అని, పెద్దాయన భీష్మ (అనంత్‌ నాగ్‌) మనవడు అని చెబుతాడు. దీని తర్వాత చైత్ర భీష్మను దూరంగా పెడుతుంది. మరోవైపు భీష్మ ఆర్గానిక్‌ కంపెనీని నేల మట్టం చేయడానికి ఫీల్డ్‌ సైన్స్‌ కంపెనీ విశ్వపయత్నాలు చేస్తుంటుంది. చివరికి ఫీల్డ్‌ సైన్స్‌ ప్రయత్నాలు సఫలమయ్యాయా? లేక హీరో అడ్డుకున్నాడా? అసలు ఇంతకీ ఆనంద్‌ చెప్పింది నిజమేనా? లేక కొడుకును కాపాడుకోవాడానికి చెప్పిన అబద్దమా? చైత్ర భీష్మను ఎందుకు దూరం పెట్టింది? భీష్మ ఆర్గానిక్‌ ఫుడ్‌ కంపెనీకి హీరోకు ఉన్న సంబంధం ఏమిటి? ఈ కథలోకి రాఘవన్‌ (జిషుసేన్‌ గుప్తా), పరిమళ్‌ (వెన్నెల కిశోర్‌), జేపీ (బ్రహ్మాజీ)లు ఎందుకు ఎంటర్‌ అవుతారు? అనేదే భీష్మ సినిమా అసలు కథ.


https://m.sakshi.com/sites/default/files/article_images/2019/09/13/Review.gif

నటీనటులు: 
ఈ సినిమాలో భీష్మగా కనిపించిన నితిన్‌ తనదైన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఫస్టాఫ్‌లో అల్లరిచిల్లరగా తిరిగే బ్యాచ్‌లర్‌గా కనిపించిన నితిన్‌, సెకండాఫ్‌లో కంపెనీ సీఈఓగా హుందాగా కనిపించాడు. అమ్మాయిల వెంట పడే రోమియోగా, అప్పుడప్పుడు మంచి వాక్యాలు చెప్పి ఇతరులను ఇంప్రెస్‌ చేసే తనలోని మరో కోణాన్ని బయటపెడుతుంటాడు. తన నటనలో డిఫరెంట్‌ షేడ్స్‌ను చూపించి నటుడిగా మరో మెట్టు ఎక్కాడు. చైత్రగా కనిపించిన రష్మిక నితిన్‌తో పోటీ పడి మరీ నటించిందనే చెప్పాలి. తన అందం, అభినయంతో మెస్మరైజ్‌ చేసింది. క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌, చెప్పే చిన్నిచిన్ని డైలాగ్‌లు చాలా ముద్దుగా ఉంటాయి.అంతేకాకుండా నితిన్‌తో కలిసి రష్మిక డ్యాన్స్‌లతో అదరగొట్టింది. అనంత్‌ నాగ్‌ తన అనుభవాన్ని రంగరించి పెద్దాయన భీష్మ పాత్రను అవలీలగా చేశాడు. వెన్నెల కిశోర్‌, రఘుబాబు, జేపీల కామెడీ టైమింగ్‌ సూపర్బ్‌గా ఉంటుంది. విలన్‌గా కనిపించిన జిషుసేన్‌ గుప్త క్లాస్‌ విలన్‌గా కనిపించాడు. అయితే అశ్వథ్థామ చిత్రంలో చూసినట్టు ఈ చిత్రంలో కనిపిస్తాడు. హెబ్బా పటేల్‌ కనిపించేది రెండు మూడు సీన్లలో అయినా ఆకట్టుకుంటుంది. 

విశ్లేషణ:
ఈ సినిమా కథ మొత్తం భీష్మ (నితిన్‌, అనంత్‌ నాగ్‌, ఆర్గానిక్‌ ఫుడ్‌ కంపెనీ) చుట్టే తిరుగుతుంది. అనుకున్న కథ ఎక్కడా డీవియేట్‌ కాకుండా, అనవసర హంగుల విషయాలకు వెళ్లకుండా దర్శకుడు వెంకీ కుడుముల చాలా జాగ్రత్తగా, పద్దతిగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. అతడు చెప్పాలనుకున్న పాయింట్‌ను పక్కాగా తెరపై ప్రజెంట్‌ చేశాడు. ఈ విషయంలో అతడికి నూటికి నూరు మార్కులు పడతాయి. అనంత్‌ నాగ్‌ ఆర్గానిక్‌ వ్యవసాయం గొప్పతనం గురించి చెప్పే స్పీచ్‌తో సినిమా ఆరంభం అవుతుంది. వెంటనే హీరో సాదాసీదా ఎంట్రీ ఇస్తాడు. ఆ తర్వాత ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎక్కడ తగ్గకుండా, కథ పక్కదారి పట్టకుండా సినిమా సాగుతుంది. హీరోయిన్‌ ఎంట్రీ, వెన్నెల కిశోర్‌, సంపత్‌, నరేశ్‌, నితిన్‌, బ్రహ్మాజీల కామెడీ, నితిన్‌, రష్మికల మధ్య వచ్చే సీన్లతో ఫస్టాఫ్‌ సాఫీగా సాగుతుంది. ఇంటర్వెల్‌కు ముందు వచ్చే ట్విస్ట్‌ అదిరిపోతుంది. 


ఇక సెకండాఫ్‌ కామెడీతోనే మొదలవుతుంది. ఆ తర్వాత అనూహ్య మలుపులు తిరుగుతుంది. ట్విస్టుల మీద ట్విస్టులు రివీల్‌ అవుతాయి. ముఖ్యంగా రెండో అర్థభాగం ఆర్గానికి వ్యవసాయం చుట్టూ తిరుగుతున్నా ఎక్కడా బోర్‌ కొట్టదు. వ్యవసాయానికి శృతి మించని ఎంటర్‌టైన్‌మెంట్‌ జోడించడం బాగుంటుంది. ఇక కొన్ని పంచ్‌ డైలాగ్‌లు వావ్‌ అనిపించేలా ఉంటాయి. ఇక ఈ సినిమాలో హీరో అంతగా చదువుకోలేదు.. డబ్బులు ఉన్నవాడు కాదు.. కానీ అనుకున్నది సాధిస్తాడు. ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తాడు. ఆశయం గొప్పదయితే ప్రకృతే మనకు అదృష్టంగా మారి మన విజయానికి సహకరిస్తుందని ‘భీష్మ’ సినిమాతో మరోసారి రుజువైంది.  
https://m.sakshi.com/sites/default/files/article_images/2019/09/13/Review.gif
ఇక సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. మ్యూజిక్‌ డైరెక్టర్‌ మహతి స్వర సాగర్‌ అందించిన పాటలు ఎంతటి హిట్‌ సాధించాయే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ ఆకట్టుకుంటుంది. సింగర్స్‌, లిరక్‌ రైటర్స్‌ తమ వంతు న్యాయం చేశారు. స్క్రీన్‌ప్లే గజిబిజీగా కాకుండా క్లీన్‌గా సాగుతుంది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సాయి శ్రీరామ్‌ తన కెమెరా పనితనంతో సినిమాను చాలా రిచ్‌గా చూపించారు. ఎడిటింగ్‌ బాగుంది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టు ఉన్నాయి. ఎక్కడా కూడా వెనక్కితగ్గకుండా ఖర్చు నిర్మాత నాగవంశీ ఖర్చు చేసినట్టు సినిమా చూస్తే అర్థమవుతుంది. ఫైనల్‌గా చెప్పాలంటే.. దర్శకుడి ప్రతిభ, ఆకట్టుకునే నటీనటులు నటన, అలరించే సంగీతం ఇలా అన్నీ కలబోసి వచ్చిన చిత్రం ‘భీష్మ’ . పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌.. పైసా వసూల్‌ చిత్రం.  

ప్లస్‌ పాయింట్స్:
నితిన్‌ నటన
రష్మిక గ్లామర్‌ అండ్‌ క్యూట్‌నెస్‌
కామెడీ

మైనస్‌ పాయింట్స్‌: 
విలనిజం ఆకట్టుకోకపోవడం
రెగ్యులర్‌ కమర్షియల్‌ ఫార్మట్‌ కావడం

- సంతోష్‌ యాంసాని, సాక్షి వెబ్‌డెస్క్‌

Rating:  
(3.25/5)
Poll
Loading...
మరిన్ని వార్తలు