చెల్లెలి కోసం...

7 Nov, 2019 00:44 IST|Sakshi
నిత్యా మీనన్‌

డిస్నీ సంస్థ నుంచి వస్తున్న తాజా హాలీవుడ్‌ యానిమేషన్‌  చిత్రం ‘ఫ్రోజెన్‌ 2’. భారతదేశంలోని ప్రాంతీయ భాషల్లోనూ ఈ చిత్రం రిలీజ్‌ కాబోతోంది. ప్రాంతీయ భాషల్లో ఆయా ప్రాంతానికి చెందిన స్టార్స్‌తో ఈ సినిమాలోని పాత్రలకు డబ్బింగ్‌ చెప్పించి సినిమాను ప్రమోట్‌ చేస్తోంది డిస్నీ సంస్థ. అన్నా, ఎల్సా అనే ఇద్దరు అక్కాచెల్లెళ్ల చుట్టూ ‘ఫ్రోజెన్‌ 2’ కథ తిరుగుతుంది. అన్నా, ఎల్సా పాత్రలకు హిందీలో ప్రియాంకా చోప్రా, పరిణీతీ చోప్రా డబ్బింగ్‌ చెప్పారు. తెలుగులో చెల్లెలి పాత్ర ఎల్సాకు నిత్యా మీనన్‌ డబ్బింగ్‌ చెప్పారు.

నిత్యా మాట్లాడుతూ – ‘‘ఈ పాత్రకు డబ్బింగ్‌ చెప్పడం సంతోషంగా అనిపించింది. ఈ సినిమా స్క్రిప్ట్‌ నాకు చాలా నచ్చింది. అమ్మాయిలకు సంబంధించి ఈ సినిమాలో మంచి సందేశం ఉంది. డిస్నీ సంస్థతో పని చేయడం కల నెరవేరినట్టుంది’’ అన్నారు. ‘ఫ్రోజన్‌ 2’ ఈ నెల 22న విడుదల కానుంది. కేరళలో పుట్టి పెరిగిన నిత్యా మీనన్‌ తెలుగు మాట్లాడగలరు. ‘అలా మొదలైంది, ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే, 24’ సినిమాల్లో పాటలు కూడా పాడారామె. అలాగే తన పాత్రలకు తానే డబ్బింగ్‌ చెప్పుకుంటారు. ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమాకి అయితే తన పాత్రతో పాటు మరో హీరోయిన్‌ ఇషా తల్వార్‌ పాత్రకు కూడా నిత్యా మీననే డబ్బింగ్‌ చెప్పడం విశేషం.

మరిన్ని వార్తలు