షూటింగ్‌లో సామాజిక దూరం కష్టమే!

24 Jun, 2020 01:21 IST|Sakshi

రాష్ట్ర ప్రభుత్వాలు షూటింగ్‌లకు అనుమతులు ఇవ్వడంతో చిత్రీకరణలకు సన్నాహాలు మొదలవుతున్నాయి. అయితే కొందరు హీరో హీరోయిన్లు మాత్రం కరోనా ప్రభావ పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు షూటింగ్స్‌కి వెళ్లకపోవడమే ఉత్తమమని ఆలోచిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో షూటింగ్‌లో మీరు ఎప్పుడు జాయిన్‌ అవ్వాలనుకుంటున్నారు? అనే ప్రశ్నను హీరోయిన్‌ నిత్యామీనన్‌ ముందుంచితే– ‘‘ప్రస్తుతం నా చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. ఏప్రిల్‌ నుంచి ఈ ఏడాది చివరి వరకు నేను షూటింగ్స్‌లో పాల్గొనాల్సింది. కానీ కరోనా వల్ల సినిమా షూటింగ్స్‌ వాయిదా పడ్డాయి.

ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో షూటింగ్స్‌లో పాల్గొనకపోవడమే ఉత్తమమని నా అభిప్రాయం. ఎందుకంటే మాట్లాడుకోకుండా, చర్చించుకోకుండా వర్క్‌ చేయడం సినిమాల్లో కష్టం. అలాగే లొకేషన్‌లో సామాజిక దూరం పాటించడం అనే అంశం కూడా ఆచరణలో విజయవంతంగా కుదరకపోవచ్చు. అందుకే సెట్స్‌లో జాయిన్‌ అయ్యేందుకు నాకేం తొందరలేదు. కానీ ఒకటి రెండు రోజులు షూటింగ్స్‌ చేస్తే ఆ ప్రాజెక్ట్‌ పూర్తవుతుందంటే అప్పుడు నేను షూటింగ్‌లో పాల్గొంటాను’’ అని పేర్కొన్నారు. అలాగే తాను ధనుష్‌తో కలిసి ఓ సినిమాలో నటించబోతున్నానని కూడా నిత్యామీనన్‌ వెల్లడించారు.

ఆశ చాలా ప్రమాదరకం: హీరోయిన్‌ నిత్యా మీనన్‌ నటించిన తొలి వెబ్‌సిరీస్‌ ‘బ్రీత్‌: ఇన్‌ టు ది షాడోస్‌’. ఇది బ్రీత్‌ సిరీస్‌లో రెండోవది. ఇందులోని నిత్యామీనన్‌ లుక్‌ను మంగళవారం విడుదల చేశారు. ‘ముమ్మ అంత త్వరగా వదిలి పెట్టదు. సియా దొరుకుతుంది. ఆశ అనేది చాలా ప్రమాదరకరమైనది. జూలై 1న ట్రైలర్‌ను విడుదల చేస్తున్నాం. జూలై 10న  ‘బ్రీత్‌: ఇన్‌ టు ది షాడోస్‌’ స్ట్రీమ్‌ అవుతుంది’’ అని పేర్కొన్నారు నిత్యామీనన్‌.

మరిన్ని వార్తలు