ఇది పెద్దలు నిశ్చయించిన పెళ్లి: నిత్యామీనన్‌

29 Nov, 2019 07:44 IST|Sakshi

సాక్షి, చెన్నైఇది పెద్దలు నిశ్చియించిన పెళ్లి అని చెప్పారు నటి నిత్యామీనన్‌. ఏంటీ ఈ అమ్మడికి పెళ్లెప్పుడయ్యింది అని షాక్‌ అయ్యారా దటీజ్‌ నిత్యా. చెప్పేది హాట్‌గా చెప్పడం ఈ బ్యూటీ నైజం. ఇటీవల దివంగత ముఖ్యమంత్రి జయలలిత పాత్రలో నటించడానికి తానే పర్ఫెక్ట్‌ అని చెప్పి చర్చల్లో నానిన ఆమె ఏదో ఒక విషయంతో సంచలనం సృష్టించడం పరిపాటే. బాలనటిగానే సినీ రంగప్రవేశం చేసిన నిత్యామీనన్‌ హీరోయిన్‌గా మాత్రం 2006లో కథానాయకిగా కన్నడ చిత్రం ద్వారా పరిచయం అయ్యారు. అయితే 31 ఏళ్ల నిత్యాకు ఇంకా పెళ్లి ఆలోచన రాలేదట. కాగా గోవాలో జరుగుతున్న అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో పాల్గొన్న ఆమె అక్కడ జరిగిన చర్చా వేదికలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తన సినీ రంగ ప్రవేశం గురించి మాట్లాడుతూ తన క్యారెక్టర్‌ సినిమాకు అసలు సెట్‌ కాదని తెలిపారు. అడవులలో మృగాలను కెమెరాలో బంధించాలన్నది తన ఆశ అని తెలిపారు.  పరిస్థితుల ప్రభావంతో అనుకోకుండా నటినయ్యాను అని తెలిపారు. అయితే సమీప కాలంగా తాను సినిమాను చాలా ప్రేమించడం మొదలెట్టానని చెప్పారు. ఇదో అందమైన రంగం అని, దీని ద్వారా తాను ప్రజల మనసుల్ని మార్చగలుగుతున్నాను. నా సినిమా జీవితం పెద్దలు నిశ్చయించిన పెళ్లి లాంటిది. ప్రేమ వివాహంలా వెంటనే భార్యభర్తల మధ్య అన్యోన్యత కలగదని వ్యాఖ్యానించారు. పెద్దలు కుదిర్చిన పెళ్లి పోను పోను అందమయిన ప్రేమానురాగాలు కలుగుతాయని తెలిపారు.

అలాంటిదే తనకిప్పుడు సినిమాపై కలుగుతున్న ప్రేమ అని వెల్లడించారు. మరో విషయం ఏమింటే తనకు మెథడ్‌ యాక్టింగ్‌ తెలియదని, అదే విధంగా తనతో ఎవరూ అధికంగా పనిచేయించలేరని చెప్పారు. సన్నివేశాలను చదివి, అర్థం చేసుకునే తారగానే నటిస్తానని తెలిపారు. అలా నటన వచ్చేస్తుందని నిత్యామీనన్‌ పేర‍్కొన్నారు. మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో నటిస్తూ బహుభాషా నటిగా పేరు తెచ్చుకున్న నిత్యామీనన్‌కు  తెలుగులో ప్రస్తుతం ఒక చిత్రం కూడా లేదు. ఇకపోతే తమిళంలో ఉదయనిధి స్టాలిన్‌తో జత కట్టిన సైకో చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. మాతృభాష మలయాళంలో మాత్రం రెండు చిత్రాల్లోతో పాటు, తమిళంలో జయలలిత పాత్రలో ది ఐరన్‌ లేడీగా మారడానికి సిద్ధం అవుతున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా