స్త్రీ ఆటబొమ్మ కాదు... ఆది పరాశక్తి

25 Sep, 2016 00:58 IST|Sakshi
స్త్రీ ఆటబొమ్మ కాదు... ఆది పరాశక్తి

- దర్శకురాలు శ్రీప్రియ
 ‘‘ఆడదంటే ఆటబొమ్మ కాదు.. ఆది పరాశక్తి అనే కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. నిత్యా మీనన్ అద్భుతంగా నటించింది’’ అన్నారు దర్శకురాలు శ్రీప్రియ. క్రిష్ జె.సత్తార్, నిత్యా మీనన్ జంటగా ‘దృశ్యం’ ఫేమ్ శ్రీప్రియ దర్శకత్వంలో వీఆర్ కృష్ణ.యం నిర్మించిన సినిమా ‘ఘటన’. మలయాళంలో ఘన విజయం సాధించిన ‘22 ఫీమేల్ కొట్టాయం’ చిత్రానికి తెలుగు రీమేక్ ఇది. శనివారం ప్రమోషనల్ సాంగ్ విడుదల చేశారు. అతిథిగా హాజరైన నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ - ‘‘ఎవరూ స్పృశించని విభిన్నమైన కథ ఇది.
 
  నర్సు ఉద్యోగాల కోసం విదేశాలు వెళ్లే అమ్మాయిలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారనే విషయాల ఆధారంగా శ్రీప్రియ ఈ సినిమా తీశారు. ఇటువంటి మహిళా సినిమాలు తీయడానికి మహిళా దర్శకురాలే కరెక్ట్’’ అన్నారు. వచ్చే నెలలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత వీఆర్ కృష్ణ.యం తెలిపారు. నరేశ్, కోట శ్రీనివాసరావు, కోవై సరళ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమేరా: మనోజ్ పిళ్లై, పాటలు: అనంత శ్రీరామ్, సంగీతం: అరవింద్ శంకర్, సమర్పణ: బేబీ సంస్కృతి.యం, బేబీ అక్షర.యం.