మహానటి సావిత్రిగా తెరపైకి నిత్యామీనన్

15 Oct, 2016 02:01 IST|Sakshi
మహానటి సావిత్రిగా తెరపైకి నిత్యామీనన్

మహానటి సావిత్రిని భారతీయ సినిమా ఎప్పటికీ మరచిపోదు. నటిగా సావిత్రి సజీవం. దక్షిణాది భాషల్లో 300 చిత్రాలకు పైగా నటించిన మహానటి సావిత్రి. మహా మహులైన నటులందరితోనూ నటించిన ఘనత సావిత్రిది. తమిళంలో శివాజీగణేశన్‌ను నడిగర్ తిలకంగా కొనియాడితే, సావిత్రి నటి తిలకంగా కీర్తించబడ్డారు. ప్రఖ్యాత నటుడు జెమినీగణేశన్‌ను ప్రేమించి పెళ్లాడిన సావిత్రి సొంతంగా చిత్ర నిర్మాణం చేపట్టి తీవ్ర నష్టాల పాలై ఆస్తులను పోగొట్టుకున్నారు. అలాంటి మహానటి నిజ జీవితం సుఖ దుఃఖాలమయం. అలాంటి అభినేత్రి జీవితచరిత్ర తెరకెక్కనుంది.

ఇటీవల తెలుగులో ఎవడే సుబ్రహ్మణ్యం వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన అశ్విన్ సావిత్రి జీవిత చరిత్రను తమిళం, తెలుగు భాషల్లో దర్శకత్వం వహించనున్నారని సమాచారం. ఈ చిత్రానికి మహానది అనే పేరును నిర్ణయించినట్లు తెలిసింది. ఇది ఇంతకు ముందు విశ్వనటుడు కమలహాసన్ నటించిన చిత్రం పేరు అన్నది గమనార్హం. ఇకపోతే ఇందులో సావిత్రి పాత్రలో నటి నిత్యామీనన్ నటించనున్నారు. సావిత్రి మాదిరిగానే కాస్త పొట్టిగా, బొద్దుగా ఉండడం, ముఖ్యంగా దక్షిణాది భాషల్లో పేరున్న నటి కావడంతో ఈ అవకాశం నిత్యామీనన్‌ను వరించిందన్నది గమనార్హం. ఇతర నటీనటులు,తదితర వివరాలు త్వరలో వెలువడే అవకాశం ఉంది.