ఇక నేను పొట్టి గౌన్లు వేసుకోవాల్సిన అవసరం లేదు

6 Sep, 2013 02:11 IST|Sakshi
ఇక నేను పొట్టి గౌన్లు వేసుకోవాల్సిన అవసరం లేదు
ఇప్పుడు కేరక్టర్ ఆర్టిస్ట్‌లకి కూడా మంచి పాత్రలొస్తున్నాయి. ‘అంతకు ముందు ఆ తర్వాత’లో నటిస్తున్నప్పుడు, ఆ సినిమాకి నేను హీరోయిన్ ఏమో అనిపించేంత బలంగా సన్నివేశాలున్నాయి. అలా ప్రాధాన్యం ఉన్న పాత్రల్నే చేస్తాను. కేరక్టర్ ఆర్టిస్ట్‌లకి ఒక పరిధి అంటూ ఉండదు. ఏ పాత్ర పడితే అది చేసేయొచ్చు. ఇప్పుడు నేను గ్లామరస్‌గా కనిపించనవసరంలేదు. ఏదైనా పాత్రలో బొద్దుగా కనిపించాలనుకోండి.. బాధపడకుండా బరువు పెరగవచ్చు. ఎందుకంటే మినీ స్కర్టులు, పొట్టి గౌన్లు వేసుకోవాల్సిన అవసరం లేదు కదా.
 
 ‘చిన్ని చిన్ని ఆశ... చిన్నదాని ఆశ...’ అంటూ అప్పుడే అరవిరిసిన ‘రోజా’లాగా సందడి చేసిన మధుబాలను ఇప్పటికీ ప్రేక్షకులు మరిచిపోలేదు. ఆ తర్వాత ఆమె ఎన్ని సినిమాలు చేసినా, ‘రోజా’ పరిమళం మాత్రం చాలా ప్రత్యేకం. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒక వెలుగు వెలిగిన మధుబాల చాలా ఏళ్ల విరామం తర్వాత ‘అంతకు ముందు... ఆ తర్వాత’ సినిమాలో తళుక్కున మెరిశారు. ఇందులో తల్లి పాత్రలో కనబడ్డ ఒకప్పటి ఈ కథానాయికతో ‘సాక్షి’ జరిపిన ప్రత్యేక సంభాషణ...
 
 ****  తెలుగులో సినిమా అంటే మొదట ఆసక్తి చూపించలేదట. నిజమేనా?
 తెలుగు అనే కాదు, అసలు దక్షిణాది భాషల్లోనే సినిమా చేయకూడదనుకున్నాను. చేస్తే హిందీలోనే చేయాలనుకున్నాను. ఎందుకంటే భాష తెలియకుండా చేయడం అనవసరం అనిపించింది. అలాగే వచ్చిన ప్రతి పాత్రనీ చేసేసి, ఫుల్ బిజీ అయిపోవాలన్న కోరికా లేదు. మంచి దర్శకులతో, మంచి కథలతో మాత్రమే సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాను. ఆ సమయంలోనే ఇంద్రగంటి మోహనకృష్ణగారు కలిశారు. ఆయన నేషనల్ అవార్డ్ విన్నర్ అని తెలిశాక, ఆయనతో పనిచేయాలనిపించింది. దానికి తోడు ఈ కథ కూడా బాగా నచ్చింది.
 
 ****  మరి.. భాష తెలియకపోతే యాక్ట్ చేయలేనన్నారు కదా?
 అందుకే ఈ చిత్రం డైలాగులను నెల రోజుల ముందే తీసుకుని, ఆ నెల రోజులూ ఓ స్కూల్ స్టూడెంట్‌లా డైలాగ్స్ బట్టీ పట్టాను. నాకైతే పరీక్షలు రాసే విద్యార్ధిలా అనిపించింది. లొకేషన్‌లో తడుముకోకుండా డైలాగ్స్ చెప్పేస్తుంటే అందరూ ఆశ్చర్యపోయారు.
 
 ****  ఒకప్పుడు తెలుగులో ‘అల్లరి ప్రియుడు’లాంటి సినిమాలు చేశారు కదా.. అప్పుడు భాష సమస్య రాలేదా?
 అప్పుడూ ముందే డైలాగులు తెలుసుకుని, కెమెరా ముందుకి వెళ్లేదాన్ని. వెనక నుంచి ఎవరైనా డైలాగులు అందిస్తుంటే నాకిష్టం ఉండదు. 
 
 ****  చాలా విరామం తర్వాత ‘అంతకు ముందు ఆ తర్వాత’ ద్వారా తెలుగు తెరపై కనిపించారు.. ఎలా అనిపిస్తోంది?
 ఈ సినిమాకి దాదాపు ఏడు రోజులు వర్క్ చేసి ఉంటాను. షూటింగ్ ఎక్స్‌పీరియన్స్ చాలా బాగా అనిపించింది. ఈ యూనిట్ సింప్లీ సుపర్బ్. 
 
 ****  బాలచందర్, కె.రాఘవేంద్రరావు, మణిరత్నం.. ఇలా పెద్ద పెద్ద దర్శకులతో సినిమాలు చేశారు కదా.. వారితో కలిసి పనిచేసిన అనుభవం మీకెంతవరకు ఉపయోగపడింది?
 బాలచందర్‌గారితో ఒక్క సినిమా చేస్తే పది సిని మాలు చేసినంత అనుభవం లభిస్తుంది. ఇక, మణిరత్నంగారి దగ్గర్నుంచి సినిమా గురించి బోల్డంత నేర్చుకోవచ్చు. రాఘవేంద్రరావుగారి గురించి ఓ విషయం చెప్పాలి. ఆయన హీరోయిన్లను చాలా అందంగా చూపిస్తారు. ఆయన దర్శకత్వంలో  ‘అల్లరి ప్రియుడు’ చేసినప్పుడు, ఓ  రోజు పాట చిత్రీకరించడానికి ప్లాన్ చేశారు. ఆ రోజు లొకేషన్లో నన్ను కెమెరాలోంచి చూసి, ‘నీ మొహంలో అలసట కనిపిస్తోంది. ఇవాళ్టికి పేకప్ చెప్పేస్తున్నా. చక్కగా నిద్రపోయి రేపు రా’ అన్నారు. అంతకు ముందు రాత్రి నేను రాత్రి సరిగ్గా నిద్రపోలేదు. దాంతో నా మొహం సరిగ్గా లేదు. అది కనిపెట్టేసి, ఆయన అలా అన్నారు. రాఘవేంద్రరావుగారు ఎంత పర్‌ఫెక్షనిస్టో చెప్పడానికి ఇదొక ఉదాహరణ.
 
 ****  ఓకే.. మీ వ్యక్తిగత విషయానికొస్తే.. ఇంతకీ మీది ప్రేమ వివాహమా, పెద్దలు కుదిర్చిన వివాహమా?
 లవ్ మ్యారేజ్. మా ఆయన బిజినెస్‌మేన్. సినిమా పరిశ్రమకు చాలాచాలా దూరం. 1997లో ఆయన్ను కలిశాను. మా ఇద్దరికీ ఓ కామన్ ఫ్రెండ్ ఉన్నారు. ఆ ఫ్రెండ్ దగ్గర నాతో యాడ్ చేయాలని చెప్పారాయన. ఆ యాడ్ షూటింగ్ సమయంలోనే మా పరిచయం పెరిగి, ప్రణయానికీ పరిణయానికీ దారితీసింది.
 
 ****  మీ ఇద్దరి కూతుళ్లకు అమేయా, కీయా అని పేర్లు పెట్టారు.. వాటి అర్థం ఏంటి?
 అమేయా అంటే కొలవలేనిది అని అర్థం. మహారాష్ట్రలో వినాయకుణ్ణి అమేయా అంటారు. కేయా అంటే ఒక పువ్వు పేరు. నవరాత్రి అప్పుడే ఆ పువ్వు పూస్తుంది. సువాసనలు వెదజల్లుతుంది. నవరాత్రులప్పుడు దుర్గామాతకు ఆ పువ్వు పెడతారు.
 
 ****  మీ అమ్మాయిలు అమేయా, కేయాలు కూడా సినిమా పరిశ్రమలోకి వస్తారా?
 అమేయాకి పెయింటింగ్ అంటే ఇష్టం. రచనలు కూడా చేస్తుంటుంది. ఇప్పుడు తనకు పదమూడేళ్లే. మరి... భవిష్యత్తులో ఎలాంటి కెరీర్ ఎంపిక చేసుకుంటుందో చూడాలి. కేయా మంచి డాన్సర్. పెద్దయిన తర్వాత తనేం అవుతుందో చూడాలి.
 
 ****  మీ తదుపరి చిత్రాలు?
 తమిళంలో ఓ సినిమా చేస్తున్నాను. అద్భుతమైన కథ. నా పాత్ర కూడా చాలా బాగుంటుంది. తెలుగులో ఎలాంటి ప్రాజెక్ట్స్ వస్తాయో చూడాలి.