సనాఖాన్ కు ముంబై కోర్టులో ఎదురుదెబ్బ!

20 Oct, 2013 20:31 IST|Sakshi
మైనర్ బాలిక కిడ్నాప్ చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ తార సనా ఖాన్ కు బొంబాయి కోర్టులో చుక్కెదురైంది. బాలిక కిడ్నాప్ కు  మీ కారు వాడినట్లు సాక్ష్యాలున్నట్టు స్పష్టం కనిపిస్తుంటే కేసును ఎలా కొట్టివేస్తాం అని సనాఖాన్ ను కోర్టు ప్రశ్నించింది. అంతేకాకుండా మీ బీఎండబ్ల్యూ కారు ఉపయోగించినప్పడు ఈ కేసుతో సంబంధం లేదని ఎలా అంటారు, కేసును ఎలా కొట్టివేస్తాం అని న్యాయమూర్తి ప్రశ్నించారు.  సనా ఖాన్ దాఖలు చేసిన పిటిషన్ ను జస్టిస్ ధర్మాధికారి, గౌతమ్ పటేల్ లు విచారించారు.  ఈ కేసులో విచారణ పూర్తైందని, వచ్చేవారంలో రోజుల్లో చార్జిషీట్ దాఖలు చేయనున్నట్టు అడిషినల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పూర్ణిమా కంథారియా వెల్లడించారు. 
 
కిడ్నాప్ వ్యవహారంలో సనా ఖాన్ కారు వాడటంతోపాటు ఆమె పాత్ర ఉందంటూ ఆరోపణలు చేస్తూ నవీ ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో గత జూన్ లో దిగువ కోర్టులో ముందస్తు బెయిల్ తీసుకుంది. ఈ కేసులో సనా ఖాన్  నవేద్ తో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. 
 
సనాఖాన్ మేనల్లుడు నవేద్ ఖాన్ కు సోషల్ మీడియా వెబ్ సైట్ ద్వారా 15 ఏళ్ల అమ్మాయి పరిచయమైందని, కొన్నాళ్ల తర్వాత అమ్మాయికి నవేద్ వివాహం చేసుకుందామని ప్రతిపాదించగా, ఆమె నిరాకరించినట్టు పోలీసులు వెల్లడించారు. ఓ రోజు ఇంటికి వెళుతుండగా, బీడబ్ల్యూ వాహనాన్ని సనాఖాన్ నడుపుతుండగా మరో ముగ్గురు ఆ బాలికను కారులోకి లాగడానికి ప్రయత్నించారని.. దాంతో ఆ అమ్మాయి తప్పించుకుని.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్న మెంటల్ చిత్రంలో సనా ఖాన్ హీరోయిన్ గా నటిస్తోంది.