ఒక్కరూ లేకున్నా.. ఎస్టీకి రిజర్వేషన్

28 Jun, 2013 00:08 IST|Sakshi

సంగారెడ్డి రూరల్, న్యూస్‌లైన్ : గ్రామంలో ఒక్క ఎస్టీ కుటుంబం లేకున్నా ఆ సామాజికవర్గానికి రిజర్వు చేయడంతో స్థానికులు విస్తుపోతున్నారు. రెవెన్యూ అధికారుల నిర్వాకం వల్లే ఇలా జరిగిందని వారు మండిపడుతున్నారు. సంగారెడ్డి మండలం చింతలపల్లి గ్రామాన్ని ప్రస్తుతం సర్పంచ్ ఎన్నికల కోసం ఎస్టీ మహిళకు రిజర్వు చేశారు. దీంతో తమ గ్రామంలో లేని ఎస్టీ అభ్యర్థులను ఎక్కడి నుంచి తేవాలని ఆయా పార్టీల నాయకులు తలలు పట్టుకుంటున్నారు.
 
 చింతపల్లి గ్రామం పంచాయతీగా 20 ఏళ్ల క్రితం ఏర్పాటైంది. పంచాయతీ ఏర్పడినప్పటి నుంచి ఓసీ జనరల్, ఎస్సీ జనరల్, 2006లో బీసీ జనరల్‌కు రిజర్వు చేశారు. అయితే 2011 జనాభా లెక్కల ప్రకారం చింతపల్లి జనాభా 1,027 ఉంది. గ్రామ శివారులో ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు నాలుగు ఉండగా ఎస్సీ విద్యార్థులు 200, ఎస్టీ విద్యార్థులు 125 మంది ఉన్నారు. జనాభా నమోదు కోసం వచ్చిన రెవెన్యూ అధికారులు హాస్టల్ విద్యార్థులను కూడా గ్రామ జనాభాలో కలిపి నమోదు చేశారు. దీంతో ప్రస్తుతం చింతల్‌పల్లి ఎస్టీ మహిళకు రిజర్వేషన్ ఖరారైంది. గ్రామంలో లేని ఎస్టీ అభ్యర్థిని ఎక్కడి నుంచి తేవాలని ఆయా పార్టీల నాయకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై  గ్రామస్థులు కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు.  ఈ విషయంలో తానేమి చేయలేనని కలెక్టర్ సమాధానమిచ్చినట్లు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు వెంకటేశం తెలిపారు. కాగా ఈ విషయమై కోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు ఆయా పార్టీల నాయకులు చెబుతున్నారు.