బాహుబలికి 14, శ్రీమంతుడుకి 11

25 Nov, 2015 23:47 IST|Sakshi
బాహుబలికి 14, శ్రీమంతుడుకి 11

 హిందీ సినిమాకు సంబంధించి గడచిన పదహారేళ్ళుగా ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్న ‘ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడెమీ’ (ఐఫా) ఉత్సవాలు ఈ సారి దక్షిణాదికి విస్తరించాయి. దక్షిణ భారతదేశంలోని నాలుగు ప్రాంతీయ భాషల (తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం) సినిమాల ప్రముఖులనూ ఈ ‘ఐఫా ఉత్సవమ్ -2015’ ఒకే వేదికపై తీసుకువస్తోంది. వివిధ కేటగిరీల్లో విజేతలను నిర్ణయించేందుకు ఇప్పుడు నామినేషన్ల హంగామా మొదలైంది.
 
  తెలుగు సినిమా నామినేషన్లలో ఉత్తమ చిత్రం, దర్శకుడు, ఉత్తమ నటుడు, నటి, సంగీత దర్శకుడు, పాటలతో సహా 14 విభాగాల్లో ‘బాహుబలి’ నామినేట్ అయింది. ఇక, ‘శ్రీమంతుడు’ చిత్రం ఏకంగా 11 కేటగిరీల్లో నామినేటైంది. ‘బాహుబలి’ చిత్రం నుంచి ఉత్తమ గాయని విభాగానికి ముగ్గురూ, ఉత్తమ గాయకుడి చిత్రానికి ఇద్దరు నామినేట్ అవడం విశేషం. రానున్న డిసెంబర్ 4, 5, 6 తేదీల్లో మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో జరిగే ఈ ‘ఐఫా - ఉత్సవమ్’లో విజేతల ప్రకటన, అవార్డు ప్రదానం జరుగుతుంది.  ఇండస్ట్రీ ప్రముఖులు, సాంకేతిక నిపుణులు వివిధ కేటగిరీలకు సంబంధించి ఓటు వేస్తారు. ఆ ఓట్లన్నిటినీ లెక్కించి, శాస్త్రీయ పద్ధతిలో విజేతలను నిర్ణయిస్తారు.