బాగా నటించాడ్రా అంటే చాలు

12 Jun, 2018 00:19 IST|Sakshi
అనంత శ్రీరామ్, కిరణ్‌ ముప్పవరపు, జయేంద్ర, కల్యాణ్‌రామ్, ఎన్టీఆర్, షరెత్, మహేశ్‌ కోనేరు

ఎన్టీఆర్‌

‘‘కల్యాణ్‌ అన్నను చూస్తుంటే మూడేళ్ల కిందట నేను పడిన టెన్షన్‌ ఆయనలో కనిపిస్తోంది. నేను ‘నాన్నకు ప్రేమతో’ సినిమా చేసినప్పుడు.. ముఖ్యంగా ఆ గెటప్‌ ఛేంజ్‌ చేసినప్పుడు.. అప్పటి వరకూ నేను చేసిన సినిమాలని దృష్టిలో పెట్టుకుంటే ఈ సినిమాని ప్రేక్షకులు యాక్సెప్ట్‌ చేస్తారా? లేదా? అనిపించింది. ప్రతి నటుడూ స్టీరియో టైప్‌ పాత్రలు, సినిమాలు చేసుకుంటూ వెళుతుంటే ఆ నటుడికే కాదు.. అభిమానులు, ప్రేక్షకులకూ సంతృప్తి ఉండదు’’ అని హీరో ఎన్టీఆర్‌ అన్నారు.

కల్యాణ్‌రామ్, తమన్నా జంటగా నటించిన చిత్రం ‘నా నువ్వే’. జయేంద్ర దర్శకత్వంలో మహేశ్‌ కోనేరు సమర్పణలో కిరణ్‌ ముప్పవరపు, విజయ్‌ వట్టికూటి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదలవుతోంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ–రిలీజ్‌ వేడుకలో ఎన్టీఆర్‌ మాట్లాడుతూ– ‘‘ఓ నటుడిగా సినిమా హిట్‌ అయిందా? లేదా? అన్నదానికంటే ‘బాగా నటించాడ్రా’.. అనే చప్పట్లే ఎంతో ముఖ్యం. కొత్తగా ట్రై చేసినప్పుడు ఈ టెన్షన్లు సర్వసాధారణం.

కానీ మీరు (కల్యాణ్‌రామ్‌) టెన్షన్‌ పడాల్సిన పనిలేదు. మన ప్రేక్షక దేవుళ్లది, మన అభిమానులది చాలా పెద్ద హృదయం. జెన్యూన్‌గా కష్టపడితే ఆ కష్టాన్ని గుర్తించి పెద్ద పీట వేయడం ఈ రోజు తెలుగు చలనచిత్ర పరిశ్రమకి కొత్తేమీ కాదు. అలాంటి కోవకు చెందిన చిత్రాల్లో ‘నా నువ్వే’ కూడా తప్పకుండా నిలుస్తుందని నా నమ్మకం. మీరు పడిన కష్టం, టెన్షన్‌ వృథా పోదు. ఈ సినిమా రిలీజ్‌ తర్వాత గంట మాట్లాడతానని అన్న చెప్పారంటే ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారో అర్థమవుతోంది. ఆ కాన్ఫిడెన్స్‌ యాక్టర్‌కి అవసరం. జయేంద్ర సార్‌కి చాలా గట్స్‌ ఉన్నాయి. ఈ సినిమాని ఓ ఛాలెంజ్‌లా భావించి చేశారాయన.

షరెత్‌గారి కెరీర్‌లో ‘నా నువ్వే’ బెస్ట్‌ ఆల్బమ్‌ అవుతుంది. అనంత శ్రీరామ్‌గారు చక్కటి సాహిత్యం అందించారు. ఈ సినిమా నిర్మాతలు విజయ్‌గారు, కిరణ్‌గారు, మహేశ్‌లకు థ్యాంక్స్‌. ఇలాంటి ఓ ప్రయత్నం చేసేటప్పుడు చాలా దమ్ముండాలి. రిజల్ట్‌ గురించి మాట్లాడుకోకుండా కథను నమ్మి ఈ సినిమా తీశారు. ఈ చిత్రం అందరి కెరీర్‌లో.. ముఖ్యంగా మా కల్యాణ్‌ అన్న కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోవాలి. ఇంకా ఇలాంటి అద్భుతమైన చిత్రాలు, కొత్త కొత్త ప్రయోగాలు ఆయన చేయాలి. మరిన్ని ప్రయోగాలు చేసే ఎంకరేజ్‌మెంట్‌ ఈ సినిమా అన్నకు ఇవ్వాలని కోరుకుంటున్నా’’ అన్నారు.

    జయేంద్ర మాట్లాడుతూ– ‘‘నిర్మాతలకి లాస్‌ ఏంజెల్స్‌లో ‘నా నువ్వే’ కథ చెప్పాను. వెంటనే సినిమా చేద్దామన్నారు. కల్యాణ్‌రామ్‌గారు నాపై నమ్మకంతో ఒకే సిట్టింగ్‌లో కథ ఓకే చేశారు. ఇప్పటి వరకూ ఆయన యాక్షన్‌ ఓరియంటెడ్‌ సినిమాలు చేశారు. ఇది రొమాన్స్‌ జానర్‌లో ఉంటుంది. 14న సినిమా చూశాక ప్రేక్షకులు కల్యాణ్‌రామ్‌ని ‘వాట్‌ ఏ లవర్‌ బోయ్‌’ అంటారు. గత చిత్రాలకంటే ఈ చిత్రంలో తమన్నా చాలా ఫ్రెష్‌గా కనిపిస్తారు. ఈ చిత్రంలో రెండు పెద్ద సర్‌ప్రైజ్‌లున్నాయి.

ఒకటి కల్యాణ్‌ మేకోవర్, రెండోది తమన్నా పాత్ర. ఇది పూర్తి రొమాంటిక్‌ ఫిల్మ్‌ కాదు. యువతరంతో పాటు కుటుంబ సభ్యులందరూ కలసి చూసేలా ఉంటుంది’’ అన్నారు. సమర్పకులు మహేశ్‌ కోనేరు మాట్లాడుతూ– ‘‘ఇది నా తొలి చిత్రం. ఈ సినిమా ఎక్స్‌ట్రా స్పెషల్‌ అని చాలాసార్లు చెప్పా. సపోర్ట్‌ చేస్తున్న అందరికీ చాలా థ్యాంక్స్‌. ఈ సినిమాలో కొత్త కల్యాణ్‌రామ్‌గారు కనిపిస్తారు. మాస్‌ హీరోగా ఇప్పటికే మార్క్‌ తెచ్చుకున్న ఆయన ఈ సినిమాతో క్లాస్‌ ఆడియన్స్‌కి మరింత దగ్గరవుతారని చాలా నమ్మకంగా ఉంది’’ అన్నారు.


కల్యాణ్‌ రామ్‌ మాట్లాడుతూ– ‘‘నా నువ్వే’ చిత్రం పాటలు చాలా పెద్ద హిట్‌ అయినందుకు వెరీ హ్యాపీ. నా కెరీర్‌లో వన్నాఫ్‌ ది బెస్ట్‌ మ్యూజిక్‌ ఆల్బమ్‌ ఇచ్చినందుకు షరెత్‌ సార్‌కి థ్యాంక్యూ. ‘నా నువ్వే’ థీమ్‌ సాంగ్‌ ఇప్పటికీ రోజుకి పదిసార్లు వింటూ ఉంటాను. జయేంద్రగారు కథ చెప్పినప్పుడు నచ్చింది. అప్పుడు ఆయన్ని ఒక్కటే ప్రశ్న అడిగా. ఈ రోల్‌కి నేను ఎలా సరిపోతారని మీరు భావిస్తున్నారు? అని. నా కెరీర్‌లో నేను చాలా కమర్షియల్‌ సినిమాలు చేశా. ఎక్కువమంది అటువంటి చిత్రాలతోనే నన్ను కలుస్తున్నారు.

ఇదొక ఔట్‌ అండ్‌ ఔట్‌ రొమాంటిక్‌ ఫిల్మ్‌. నేనెప్పుడూ ఇలాంటి చిత్రం చేయలేదు. అప్పుడు ఆయన నాతో అన్నారు. ‘ఓ రొమాంటిక్‌ హీరోతో రొమాంటిక్‌ సినిమా చేయొచ్చు. దట్స్‌ సింపుల్‌ అండ్‌ ఈజీ. కానీ ప్రేక్షకులకు ఏం కొత్తగా ఉంటుంది? కానీ, ఇప్పటి వరకూ మీరు చేయని ఈ రోల్‌ చేసి ప్రేక్షకులకు నచ్చితే అది నాకు పెద్ద సక్సెస్‌’ అన్నారు. నాపై ఆయన నమ్మకం చూసి ఈ సినిమా చేశా. నా వద్దకి ఇటువంటి ప్రాజెక్ట్‌ తీసుకురావడంతో పాటు పెద్ద టెక్నీషియన్స్, పెద్ద హీరోయిన్‌ని తీసుకొచ్చినందుకు నిర్మాతలకు థ్యాంక్స్‌. చాలా ఏళ్లుగా నేను కొత్తగా ట్రై చేస్తున్నాను.

ప్రేక్షకులు, అభిమానులు ఆదరిస్తున్నారు. నా ఇన్నేళ్ల కెరీర్‌లో ఇలాంటి సినిమా చేయలేదు. నా ఈ ప్రయత్నాన్ని మీరు మళ్లీ ఆదరిస్తారని కోరుకుంటున్నా. సినిమా విడుదలయ్యాక గంట సేపు మాట్లాడతా. ‘నాన్నకు ప్రేమతో’ సినిమాతో తారక్‌ టోటల్‌గా ఛేంజోవర్‌ అయ్యాడు. నేను కూడా ఇలా ఓ సినిమాకి చేయాలనుకున్నా. ఆ దేవుడు, మా తాతగారు (ఎన్టీఆర్‌) విని, నాకు ఈ సినిమా ఇచ్చారని నమ్ముతున్నా’’ అన్నారు. చిత్రనిర్మాత కిరణ్, సంగీత దర్శకుడు షరెత్, పాటల రచయిత అనంత శ్రీరామ్, నిర్మాతలు నాగవంశీ, పీడీవీ ప్రసాద్, విజయ్‌ చిల్లా తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు